గ్రామీణ కళలను పరిరక్షించి భావితరాలకు అందించేందుకు, పల్లె కళాకారుల్లో ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడుతాయని జిల్లా గృహ నిర్మాణశాఖ సంచాలకులు వైద్యం భాస్కర్ పేర్కొన్నారు.
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: గ్రామీణ కళలను పరిరక్షించి భావితరాలకు అందించేందుకు, పల్లె కళాకారుల్లో ప్రతిభాపాటవాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడుతాయని జిల్లా గృహ నిర్మాణశాఖ సంచాలకులు వైద్యం భాస్కర్ పేర్కొన్నారు. నగరంలోని షాదీఖానాలో జిల్లా యువజన సర్వీసుల శాఖ-సెట్‌కమ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. సెట్‌కమ్ ముఖ్య కార్యనిర్వహణధికారి ఎస్. వెంకటరంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడులను ఉద్దేశించి ముఖ్య అతిథి హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ మాట్లాడారు. యువ క ళాకారులు తాము ఎంచుకున్న అంశంలో అత్యున్నత ప్రతిభ కనబర్చేందుకు నిరంతరం శ్రమించాలన్నారు.
ప్రతిభ కనబరిచే కళాకారులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు సమాజం ఎప్పుడూ ముందుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష త్వరలో సాకరమయ్యే అవకాశం ఉన్నందున ఈ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిరక్షించాలని, వాటిని భావితరాలకు అందించాలని కోరారు. యువజనోత్సవాల్లో పాల్గొంటున్న కళాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని సోషల్ వెల్ఫేర్ డీడీ రంగలక్ష్మీదేవి సూచించారు. ఓటమిని గెలుపునకు పునాదిగా భావించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ నుంచి అక్టోబర్ వరకు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో యువజనోత్సవాలు నిర్వహించామని సెట్‌కమ్ సీఈఓ వెంకటరంగయ్య తెలిపారు. ఈ ఉత్సవాల్లో నిర్దేశించిన 18 అంశాల్లో ప్రథమ, ద్వితీయస్థానం పొందిన కళాకారులకు జిల్లాస్థాయి యువజనోత్సవాల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పించామన్నారు.
మిమిక్రీ, ఏకపాత్రాభిన యం, వక్తృత్వం, కామెడీస్కిట్, జానపద గేయాలు, నృత్యం, చిత్రలేఖనం, క్విజ్, మార్షల్‌ఆర్ట్స్, ఫ్యాషన్ షో, మోనోయాక్షన్, మ్యాజిక్ షో, వ్యాసరచన ఇలా మొత్తం 13 అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీటిలో ప్రథమస్థానంలో నిలిచిన వారిని ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రస్థాయి యువజనోత్సవాలకు పంపిస్తామన్నారు. మిగిలిన ఐదు అంశాలపై ఈ నెల 18న భక్తరామదాసు కళాక్షేత్రంలో పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ యువజనోత్సవాలకు ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు మహ్మద్ అబ్దుల్‌నయీం, సాంబశివరావు, వెంకటలాల్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వి.మున్నయ్య, అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ కార్యనిర్వహక సంచాలకులు ఎం. తఖద్దుస్ అహ్మద్, తెలంగాణ ఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు గరిడేపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.