'ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవు'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ఆధ్యాత్మిక విషయాలలో పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించకుండా, పక్కన పెట్టడం శోచనీయమని ఆయన అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందనే.. ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు.