గోదావరి తీరంలో జనజాతర
రాజమండ్రి : ఎన్నో ఇబ్బందులు.. మరెనో అవాంతరాలు.. ఇవేమీ భక్తిపారవశ్యాన్ని అడ్డుకోలేకపోయాయి. ‘పుష్కర’ రోజులు తరిగిపోతున్నకొద్దీ భక్తుల్లో పుష్కర పుణ్యస్నానం చేయాలనే ఆరాటం పెరిగిపోతోంది. ఒక్కసారైనా గోదావరిలో పుష్కర స్నానం చేయాలని.. లేకుంటే మరో 12 ఏళ్లు పుణ్యస్నాన భాగ్యం దక్కదన్నట్టుగా భక్తులు గోదావరి తీరానికి వెల్లువలా తరలివస్తున్నారు. ఎక్కడెక్కడివారో రెక్కలు కట్టుకు వచ్చి వాలిపోతున్నారు. పుష్కరాల తొమ్మిదో రోజైన బుధవారం కూడా యాత్రికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం.. సెంటిమెంట్ కారణంగా కాస్త తగ్గినప్పటికీ బుధవారం తిరిగి పోటెత్తారు.
భక్తజనుల తాకిడికి ఈ మహాపర్వం తొమ్మిదో రోజుకే 2003 పుష్కరాలకు వచ్చిన భక్తుల రికార్డు బద్దలు కావడం విశేషం. బుధవారం రాత్రి 9 గంటల సమాయానికి జిల్లావ్యాప్తంగా 32 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీంతో గడచిన తొమ్మిది రోజులుగా జిల్లావ్యాప్తంగా పుష్కర స్నానాలు చేసినవారి సంఖ్య 2.41 కోట్లకు చేరింది. గత పుష్కరాల్లో 12 రోజుల్లో 2,19,75,140 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ఈ ఏడాది ఈ సంఖ్యను తొమ్మిది రోజులకే అధిగమించారు. మిగిలిన మూడు రోజుల్లో కూడా భక్తుల తాకిడి ఇదేవిధంగా కొనసాగనుంది. జనం రాక చూస్తుంటే ఈ ఏడాది జిల్లాలో పుష్కర స్నానాలు చేసేవారి సంఖ్య మూడు కోట్లు దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా..
రాజమండ్రి నగరంలో యాత్రికుల తాకిడి అధికంగా కనిపించింది. నగరంలోని ఘాట్‌లు మరోసారి భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ అడపాదడపా పెద్ద వర్షమే పడినా భక్తులు లెక్క చేయలేదు. తండోపతండాలుగా ఘాట్‌లకు చేరుకున్నారు. వృద్ధులు, చంటిబిడ్డలతో వచ్చిన మహిళలు సైతం వర్షంలోనే తడుస్తూ ఘాట్‌ల వద్దకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. వర్షంవల్ల ఘాట్‌లవద్ద పిండప్రదానాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలీచాలని సౌకర్యాల నడుమ వర్షంలో తడుస్తూనే పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు.
గోదావరి హారతికి మంత్రివర్గం
గోదావరి నిత్యహారతి కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్గం తరలివచ్చింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రివర్గంతోపాటు వేలాదిగా భక్తులు రావడంతో గోదావరి హారతి కన్నుల పండువగా సాగింది.