సాక్షి, రాజమండ్రి :గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టాల్సిన పనులకు రూ.240 కోట్ల మేరకు మంజూరు లభిస్తే ప్రభుత్వం ఇప్పటికి అందులో సగం నిధులే విదిల్చింది. మిగిలిన పనుల అంచనాలను తగ్గించే పనిలో అధికారులు పడ్డారు. పుష్కర నిధులు 13వ ఆర్థిక సంఘం నుంచి ఇస్తామని జీఓ ఇచ్చి నాలుక కరుచుకున్న సర్కారు ఇప్పుడు దిద్దుబాటులో పడింది. ఇందులో భాగంగా జీఓలు ఇచ్చిన పనులను సాధారణ పనుల్లో లెక్క చూపించి, కొద్దోగొప్పో ఇతరనిధులు విడుదల చేసి ఆర్థిక సంఘం నిధులు అవసరం లేదని చెప్పేందుకు కసరత్తు చేస్తున్నారు. కాగా ఈపరిణామాలు పుష్కర పనులు ఆలస్యం కావడానికి కారణమవుతున్నారుు.
మరింత కుదింపునకు కసరత్తు
పురపాలక శాఖలో సాధారణ నిధులతో చేపట్టాల్సిన పనులు చాలా నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం వాటిని వేగవంతం చేశారు. ప్రజలకు అప్పుడే పుష్కరాల పనులు చేపట్టేశారనే భావన కలిగించేలా గోకవరం బస్టాండు- సీతంపేట, గోదావరి గ ట్టురోడ్డు, కంబాలచెరువు -లాలాచెరువు రోడ్డు, తాడితోట బైపాస్ రోడ్డు ఇతర ప్రాంతాల్లో రోడ్ల పనులు ప్రారంభించారు. ఈ పనులు ఎలాగూ చేస్తున్నారు కాబట్టి వాటిని పుష్కర పనుల్లోంచి తొలగించి నిధులు మిగిల్చామని అధికారులు చెబుతున్నారు. రూ.240 కోట్లతో ముందు ప్రతిపాదించిన 536 పనుల్లో 22 పనులు సాధ్యం కావని తొలగించారు. సుమారు 19 పనులు జనరల్ నిధులతో చేస్తున్నామని తొలగించారు. పెద్ద పనులు కన్సల్టెన్సీలకు అప్పగించడం వల్ల రూ.తొమ్మిది కోట్ల మేర ఆదా అయిందని చెబుతున్నారు. రాజమండ్రిలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పర్యాటక శాఖ చేపడుతున్నందున దానికి అయ్యే రూ.15 కోట్లు తొలగించినట్టు చెబుతున్నారు. ఇలా మొత్తంగా రూ.44 కోట్ల విలువైన పనులను తొలగించేశారు. వీటిని మరింతగా కుదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీలకు పుష్కరాలకు ఇస్తామన్న నిధుల్లో రూ.168 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో రాజమండ్రికి రూ.120 కోట్లు మంజూరయ్యాయి. ఈ విషయాన్ని పురపాలక శాఖ కమిషనర్ వాణీ మోహన్ తన జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం వెల్లడించారు. కాగా నిధులు మాత్రం త్వరలో విడుదల అవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో పనుల కుదింపు కసరత్తు చూస్తుంటే ఇంతకు మించి నిధులు విడుదల అవుతాయన్న నమ్మకం కలగడం లేదు.
సగమే విదిల్చారు
Published Sun, Mar 8 2015 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement
Advertisement