పుష్కరాలకు పుష్కల నిధుల్లేవ్!
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు నిధులు పుష్కలమన్నారు. కుంభమేళా తరహాలో నిర్వహిస్తామన్నారు. కాని ఆచరణ అధ్వానంగా ఉంది. గోదావరి పుష్కరాల గురించి గత కొంతకాలంగా మంత్రులు, ముఖ్యమంత్రి అనేక ప్రకటనలు చేశారు. తీరా పనుల విషయం వచ్చేసరికి తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసింది. దేవాదాయశాఖకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకొంది. కేంద్రం నుంచి నిధులొస్తాయని నమ్ముతున్న రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానాపై భారం మోపొద్దని నిర్ణయించుకుంది.
దాదాపు రూ.425 కోట్లను దేవాలయాల అభివృద్ధికి వినియోగించనున్నామని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.100 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. గోదావరి నదీతీరంలో ఉన్న ప్రముఖ దేవాలయాల కార్యనిర్వహణాధికారులతో దేవాదాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయానికి రూ.2 కోట్లు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి రూ.2 కోట్లు, భద్రాచలం రామచంద్రస్వామి దేవాలయానికి రూ.కోటి, కాళేశ్వరం ముక్తేశ్వరాలయానికి రూ.కోటి, మంథని గౌతమేశ్వరాలయానికి రూ.60 లక్షలు, రాయపట్నం దేవాలయానికి రూ.60 లక్షలు చొప్పున కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. మిగతా నిధులు ఇతర చిన్న, చిన్న దేవాలయాలకు అందజేయనున్నట్టు తెలిపారు.
జూలైలో పుష్కరాలు మొదలవుతున్న నేపథ్యంలో అత్యవసర పనులను ఇప్పటి నుంచే నిర్వహించాల్సి ఉంటుందని కార్యనిర్వహణాధికారులు పలు ప్రతిపాదనలను అందజేశారు. పుష్కరాలకు నిధులు విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని కేంద్రమంత్రి దత్తాత్రేయను కోరినట్టు ఇంద్రకరణ్ చెప్పారు. కేంద్రం నుంచి రెండు నెలల్లో వచ్చే నిధులను పుష్కరాల పనులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు కేటాయించిన నిధులతో అత్యవసర పనులను పక్షం రోజుల్లో ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.