రథ మండపం వద్దకు చేరుకున్న బంగారు రథం
తిరుమల: స్వామివారి బంగారురథం ట్రయల్ రన్ ముగిసింది. బంగారు రథం రథ మండపం వద్దకు చేరుకుంది. తిరుమలేశుని కైంకర్యసేవ కోసం తయారు చేసిన కొత్త స్వర్ణరథం ట్రయల్ రన్లో అపశ్రుతి చోటు చేసుకుంది. టీటీడీ అధికారులు సోమవారం ఉదయం దీనిని ఆలయ వీధుల్లో ప్రయోగాత్మకంగా ఊరేగించారు. ఎస్వీ మ్యూజియం నుంచి మాడవీధుల్లో రథ మండపానికి తరలించారు. సుమారు గంట సమయం పట్టింది. అయితే రథం తరలిస్తుండగా ఎస్వీ మ్యూజియం మలుపు వద్ద రథం భూమిలోకి కూరుకుపోయింది. రథ చక్రాలు మట్టిలోకి దిగబడిపోయాయి. దీంతో క్రేన్ సహాయంతో రథాన్ని టీటీడీ సిబ్బంది బయటకు తీశారు.
బంగారు రథం ట్రయల్ రన్‌లో లోపాలున్నాయని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు చెప్పారు. ఆ లోపాలను వెంటనే సవరిస్తామన్నారు.
ఈ స్వర్ణ రథం ఎత్తు 32 అడుగులు. బరువు 28 టన్నులు. ఇటువంటి స్వర్ణరథం దేశంలో మరెక్కడా లేదు. రథం తయారీలో 74 కిలోల బంగారం, 2,900 కిలోల రాగి, 25 టన్నుల దారుచెక్క, ఇనుము వినియోగించారు. 18 అడుగుల గేజ్ కలిగిన రాగిపై 9సార్లు బంగారు పూత పూశారు. ఇందుకోసం రూ.24.34 కోట్లు వ్యయం అయింది.