సామాన్యుడిని నిత్యావసర వస్తువుల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏటా వచ్చే ఆదాయం పెరగకపోయినా ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పండుగల సమయాల్లో ఈ ధరలు రెండింతలు అవుతుండడంతో అప్పుచేసి పండుగలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధరల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడాన్ని పేదలు తప్పుపడుతున్నారు.
తిరుపతికి చెందిన సుబ్బమ్మ నాలుగో తరగతి ఉద్యోగిని భార్య. భర్త పారిశుద్ధ్య కార్మికుడు. ఇతని నెల వేతనం రూ.10వేలు. కటింగ్‌లు పోను నెలకు రూ.9,500 చేతికి వస్తుంది. గత ఏడాది కూడా ఇదే వేతనం. సుబ్బమ్మ కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో ఒకరు 10వ తరగతి, ఇంకొకరు 9వ తరగతి చదువుతున్నారు. భర్త సంపాదనపైనే కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. కరెంటు బిల్లుతో కలుపుకుని ఇంటి అద్దె రూ.5వేలు. బియ్యం, గ్యాస్, నిత్యావసర వస్తువులకు నెలకు మరో రూ.5వేలు ఖర్చు అవుతోంది. ఇతరత్రా ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండానే సుబ్బ మ్మ భర్త సంపాదన పోను ప్రతినెలా రూ.500 అప్పు వస్తోంది.
ఇది గత ఏడాది ఖర్చు వివరాలు. అదే ప్రస్తుత ఏడాది ఇంటి అద్దె రూ.500 పెరిగింది. నిత్యావసర వస్తువుల కోనుగోళ్లకు నెలకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు అవుతుంది. ప్రస్తుత ఏడాదిలో ప్రతినెలా అదనంగా రూ.1,500 అప్పు వస్తోంది. ఏటా ఖర్చులు పెరుగుతున్నా సుబ్బమ్మ భర్త వేతనం పెరగలేదు. ఎటువంటి ఆదాయమూ లేదు. సుబ్బ మ్మ ఆ ఇల్లు, ఈ ఇల్లు అని పాచిపనికి వెళితే రూ.వెయ్యి వరకు వస్తుంది. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రి ఖర్చు అదనం. ఇలా సుబ్బమ్మ కుటుంబానికి ఏటా ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఇది ఒక్క సుబ్బమ్మ కుటుంబానికే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితి..
ఏటా పెరుగుతున్న ధరలు
ఏటా పండుగలు వచ్చాయంటే సామాన్యుడి గుండెల్లో గుబులు రేగుతోంది. ఆదాయం పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కటే కాదు ప్రతి వస్తువు ధర ఆకాశాన్నంటుతోంది. జీఎస్టీ అమలైన రోజు నుంచి వ్యాపారులు అనేక మంది ధరలు పెంచేశారు. బిల్లు వేయకపోయినా జీఎస్టీ అంటూ వినియోగదారుల నుంచి భారీ ఎత్తున వసూలు చేస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె ఇతర వస్తువుల ధరలను ç2005 నుంచి పరిశీలిస్తే రెండో రకం బియ్యం రూ.8 నుంచి రూ.45 చేరుకుంది. పప్పులు విషయానికి వస్తే రూ.30 నుంచి రూ.80 చేరాయి. గోధుమ పిండి కిలో రూ.20 నుంచి 50కి చేరింది.
ఇలా ప్రతి వస్తువు ధర నాలుగు రెట్లు పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇలా ఉంటే పండ్లు, పూల ధరలు కూడా పండుగ రోజు ఆకాశాన్నంటుతున్నాయి. మామూలు రోజుల్లో అయితే మూర పూలు రూ.10 ఉంటే, పండుగ రోజుల్లో రూ.25 అమ్ముతున్నారు. పండ్లు విషయానికి వస్తే సామాన్యుడు పండు కొని తినే పరిస్థితి లేదు. ఆపిల్ పండ్లు కిలో రూ.100, అరటిపండ్లు డజను రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. మధ్య తరగతి వారు కొందరు, ధనవంతులు మాత్రమే పం డ్లు కొనుగోలు చేస్తున్నారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment