
ఆర్థిక అసమానతలు తొలగితేనే అభివృద్ధి
♦ దేశంలో ఏపీలోనే తొలుత నదుల అనుసంధానం
♦ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం ముందడుగు
♦ గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, విజయవాడ: ఆర్థిక, సాంఘిక అసమానతలను తొలగించడం ద్వారానే సుస్థిర ఆర్థికాభివృద్ధి సాధించి ఆరోగ్య, ఆనంద, పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దగలమని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించి నదుల అనుసంధానం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన చెప్పారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులనూ ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు. 67వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం గవర్నర్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం చినరాజప్ప, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ రాముడుతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ..
► ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ 4.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది.
► వ్యవసాయానికి ఉచితంగా ఏడు గంటలు విద్యుత్ అందించడంతో పాటు చిన్న, సన్న కారు రైతుల ఆదాయాలను పెంచేందుకు రూ.500 కోట్ల ప్రపంచ బ్యాంకు సహాయంతో గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టింది..
► ఎన్టీఆర్ వైద్య పరీక్ష ద్వారా పేదలకు టెలీరేడియాలజీ సర్వీసులతోపాటు 60 పరీక్షలను ఉచి తంగా అందజేస్తోంది. గర్భిణులు, నవజాత శిశువుల సంరక్షణకు 102 అమలు చేస్తోంది.
► కాపులను అభివృద్ధి పరచడానికి రూ.100 కోట్లతో కాపు కార్పొరేషన్, వారిని బీసీల్లో చేర్చే అంశాన్ని పరిశీలించడానికి రిటైర్డ్ న్యాయమూర్తి మంజునాథన్ కమీషన్‌ను ఏర్పాటు చేసింది.
► ఈ ఏడాదికి ఎస్‌సీ సబ్‌ప్లాన్‌కు రూ.5877.96 కోట్లు, ఎస్‌టీ సబ్‌ప్లాన్‌కు రూ.1955.93 కోట్లు, బీసీ సబ్ ప్లాన్‌కు రూ.6640 కోట్లు కేటాయించింది.
► సింగిల్ డెస్క్ పాలసీ, సింగిల్ డెస్క్ పోర్టల్ విధానం పెట్టుబడుల ఆకర్షణలో ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లో దేశంలో ఏపీ రెండో స్థానంలో నిలించింది.
► ఈ సంవత్సరం కృష్ణా పుష్కరాలను భారీ ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.