విజయవాడలోని స్వరాజ్య మైదానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల స్వార్థం, ధన దాహానికి సర్కారీ ఆస్తులు కరిగిపోయే దుస్థితి దాపురించింది. సాగునీటి ప్రాజెక్టుల పనులను కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టడం.. తర్వాత అదనపు బిల్లులు చెల్లించడం.. వారి నుంచి అందిన కాడికి కమీషన్లు దండుకుని జేబులు నింపుకోవడం.. ఇదే ఇప్పుడు అమలవుతున్న నీతి. అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులు హారతి కర్పూరమైపోయినా సరే స్వలాభమే ముఖ్యమంటూ ప్రభుత్వ పెద్దలు ఆరాటపడుతుండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర రాజధాని విజయవాడలోని చరిత్రాత్మక స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు చెల్లించాలని మచిలీపట్నం కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. టీడీపీ సర్కారు నిర్వాకం వల్ల పులిచింతల కాంట్రాక్టర్‌కు రూ.390.65 కోట్ల అదనపు బిల్లులను ఖజానా నుంచి చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీని వెనుక ఉన్న అసలు దందా ఏమిటంటే...
పులిచింతల ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ.268.87 కోట్లు. కానీ, ఒప్పందం విలువ కంటే అదనంగా చెల్లించాలని కాంట్రాక్టర్ కోర్టుకెక్కారు. అదనపు బిల్లులు చెల్లించాలని 2016 జూన్ 2న మచిలీపట్నం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును వివాద పరిష్కార మండలి(డీఏబీ) ప్రతిపాదన మేరకు అప్పుడే హైకోర్టులో సవాల్ చేసి, కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలపై సాధికారికంగా వాదనలు వినిపించి ఉంటే అదనపు బిల్లులు చెల్లించాల్సిన దుస్థితి దాపురించేది కాదని జలవనరుల శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. హైకోర్టును ఆశ్రయించకుండా ప్రభుత్వ ముఖ్యనేత, మరో కీలక మంత్రి అడ్డుకోవడం వల్లే పులిచింతల కాంట్రాక్టర్‌కు రూ.390.65 కోట్లను అదనపు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
కాంట్రాక్టు ఒప్పందంలో ‘డీఏబీ’
పులిచింతల ప్రాజెక్టుకు 2003 అక్టోబర్ 30న ఎన్నికలకు ఆరు నెలల ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా రూ.565.89 కోట్లతో పరిపాలన అనుమతి ఇచ్చేశారు. రూ.268.89 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం) పనులను తనకు అత్యంత సన్నిహితుడైన బొల్లినేని శీనయ్యకు చెందిన కాంట్రాక్టు సంస్థ ఎస్‌సీఎల్–సీఆర్18జీ(జాయింట్ వెంచర్)కి అప్పగించారు. రాష్ట్రంలో జలవనరుల శాఖ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో బిల్లుల విషయంలో ఏవైనా వివాదం ఉంటే డీఏబీని ఆశ్రయించవచ్చనే నిబంధనను కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చారు. ఇంతలోనే ఎన్నికలు జరిగాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టారు. చంద్రబాబు నియమించిన పులిచింతల కాంట్రాక్టర్ అప్పటిదాకా తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్ అధికారం చేపట్టిన వెంటనే పులిచింతల ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. డీఏబీని అడ్డం పెట్టుకుని చీటికీమాటికీ అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ పేచీ పెడుతుండడంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో డీఏబీని వైఎస్సార్ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని అప్పట్లో కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో డీఏబీ–1ను ఏర్పాటు చేశారు. డీఏబీ సిఫార్సుల మేరకు కాంట్రాక్టర్‌కు రూ.5.65 కోట్లు చెల్లించారు. భూసేకరణ, బిల్లుల చెల్లింపులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవడంతో 2009 నాటికే పలిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది.
అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ పట్టు
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత అదనపు బిల్లుల కోసం కాంట్రాక్టర్ మళ్లీ పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్ వేను 500.25 మీటర్లు పెంచారని, గేట్లను 39 నుంచి 24కు తగ్గించారని, భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాలను లేవనెత్తారు. అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను వామనరావు, జె.ఈశ్వర్‌ప్రసాద్, మోతీలాల్.బి.నాయక్ సభ్యులుగా ఏర్పాటైన డీఏబీ–2 పరిశీలించింది. కాంట్రాక్టర్‌కు రూ.199.96 కోట్లు అదనంగా చెల్లించాలని 2013 అక్టోబర్ 3న ప్రభుత్వానికి సూచించింది. డీఏబీ–2 సూచనను ముగ్గురు ఐఏఎస్‌లతో కూడిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పంపారు.
కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లకు మించి పైసా కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదని నిపుణుల కమిటీ తేల్చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో 2014 ఎన్నికలు వచ్చాయి. డీఏబీ–2 సిఫార్సును అమలు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై కాంట్రాక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జవనరుల శాఖ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో తన ప్రభుత్వం పడిపోకుండా కాపాడినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడి సన్నిహిత కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చడానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉత్తర్వులు ఇప్పించినట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఈ మచిలీపట్నం కోర్టును ఆశ్రయించారు. ఈలోగా తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో గెలిచి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కోర్టులో సాధికార వాదనలేవీ?
పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు చెల్లించే విషయంపై మచిలీపట్నం కోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. కాంట్రాక్టర్ లేవనెత్తిన 27 అంశాలను తిప్పికొట్టేలా వాదనలు విన్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా 2016 జూన్ 2న మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చింది. 2013 అక్టోబర్ 3 నుంచి 15 శాతం వడ్డీతో కలిపి కాంట్రాక్టర్‌కు రూ.199.96 కోట్లు చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ, న్యాయపోరాటానికి అనుమతి ఇవ్వకుండా ‘ముఖ్య’నేత, కీలక మంత్రి జాప్యం చేస్తూ వచ్చారు. ఇదే అంశాన్ని ‘సాక్షి’ వరుస కథనాల ద్వారా ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తూ వచ్చింది. దాంతో చేసేదిలేక ఈ వ్యవహారంపై అడ్వొకేట్ జనరల్ నుంచి లీగల్ ఒపీనియన్(న్యాయ అభిప్రాయం) తీసుకోవాలని జలవనరుల శాఖకు సర్కార్ సూచించింది. లీగల్ ఒపీనియన్ ఇవ్వడంలోనూ జాప్యం చోటుచేసుకుంది. అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా జారీ చేసిన ఉత్తర్వులు బిజినెస్ రూల్స్ ప్రకారం ఉంటే చెల్లింపులు చేయాలని.. లేకుంటే న్యాయస్థానంలో సవాల్ చేసే అంశాన్ని పరిశీలించాలని అడ్వొకేట్ జనరల్ సూచించారు.
న్యాయ పోరాటానికే సీఎస్‌ల మొగ్గు
పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లులు ఇవ్వాలని మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. కానీ, లీగల్ ఒపీనియన్ పేరుతో అప్పట్లో సర్కార్ న్యాయపోరాటానికి మోకాలడ్డింది. లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత కూడా హైకోర్టులో సవాల్ చేయాలని ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ స్పష్టం చేశారు. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.
రెండు ఆస్తుల విక్రయ నోటీసు జారీ
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని.. తనకు చెల్లించాల్సిన సొమ్మును సర్కారీ ఆస్తులను విక్రయించి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ 2017లో పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ మచిలీపట్నం కోర్టులో ఎగ్జిక్యూటివ్ పిటిషన్(ఈపీ)ను దాఖలు చేశారు. విజయవాడలోని స్వరాజ్య మైదానం, పులిచింతల ప్రాజెక్టు కోసం సేకరించిన 48 ఎకరాల భూమిని సర్కారీ ఆస్తులుగా కాంట్రాక్టర్ పేర్కొన్నారు. ఈ వివాదంపై విచారించిన కోర్టు.. ఆ రెండు ఆస్తులను అటాచ్‌మెంట్ చేస్తూ 2017 జూలై 31న తీర్పు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ కొనసాగింపులో భాగంగా, ఆ రెండు ఆస్తులకు విక్రయ నోటీసును ఈ ఏడాది మే 2న జారీ చేసి.. విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. ఆ తర్వాత ఈ కేసుపై సోమవారం మచిలీపట్నం కోర్టు తీర్పు ఇచ్చింది. స్వరాజ్య మైదానం, జలవనరుల శాఖ భవనాలను వేలం వేసి పులిచింతల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించాలని పేర్కొంది. ఈ తీర్పును అమలు చేస్తే పులిచింతల కాంట్రాక్టర్‌కు అసలు రూ.199.96 కోట్లు, 2013 అక్టోబర్ 3 నుంచి ఇప్పటివరకూ వడ్డీ రూ.144.63 కోట్లు.. వెరసి రూ.355.59 కోట్లు, ప్రాజెక్టు పూర్తయినా యంత్రాలను అక్కడే ఉంచడం వల్ల వాటిల్లిన నష్టం రూ.46.06 కోట్లతో కలిపి మొత్తం రూ.390.65 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
కాంట్రాక్టర్ మనోడైతే చాలు
పులిచింతల కాంట్రాక్టర్ బొల్లినేని శీనయ్యతో ముఖ్యనేత, కీలక మంత్రి అనుబంధం బహిరంగ రహస్యమే. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువలో రూ.వందల కోట్ల విలువైన పనులను నామినేషన్ విధానంలో బొల్లినేని శీనయ్యకే కట్టబెట్టారు. రాజధానిలో రహదారులు, మౌలిక సదుపాయాల పనులు కూడా అప్పగించారు. పులిచింతల ప్రాజెక్టులో నాడు డీఏబీ నిబంధన పెట్టడం ద్వారా ప్రయోజనం చేకూర్చిన ముఖ్యనేత, నేడు దాన్ని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు ఒప్పంద విలువ కన్నా అధికంగా రూ.390.65 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడి మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా అడ్డు పడుతున్నారని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు చెప్పారు. తాజాగా మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయడానికి ముఖ్యనేత పావులు కదుపుతున్నారు.
విశ్వ బ్రాహ్మణులను మోసం చేశారు
ప్రస్తుత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులను చులకనగా చూస్తోంది. బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని దారుణంగా మోసం చేసింది. జిల్లాలో గ్రూప్ లోన్ల కింద మొత్తం 136 సొసైటీలు ఏర్పడితే కేవలం 18 గ్రూపులకు మాత్రమే లోన్లు ఇచ్చారు. మిగతా వారు పలుమార్లు వారి చుట్టూ తిరిగినా ఇవ్వడం లేదు. చేతి వృత్తులు ఆదరణ కోల్పోవడంతో విశ్వబ్రాహ్మణులందరూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. మా సమస్యలను జగన్ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఆయన ఆదుకుంటారనే నమ్మకం ఉంది.
– టి.శ్రీనివాసరావు,విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు
నీళ్లు లేవు.. రోడ్లు లేవు..
అయ్యా.. మాది కొత్తవలస మండలం, కంటకాపల్లి పంచాయతీ పరిధిలోని సాంబయ్య పాలెం. జనాభా 500. తాగు నీటి ట్యాంక్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యను ఎన్ని సార్లు అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు మా గ్రామం వైపు కన్నెత్తి చూడటం లేదు. సీసీ రహదారులు, కాలువలు కూడా లేవు. మా గోడును వైఎస్ జగన్‌తో చెప్పుకుందామని మహిళలందరం కలిసి వచ్చాం.
– చల్లా లక్ష్మి, రమణమ్మ, గ్రామస్తులు
కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నా..
అన్నా.. మాకు కనీసం వేతనాలు ఇవ్వడం లేదు. వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వ పరంగా చేయాల్సిన చట్ట సవరణ జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మాకు రెండేళ్లకు ఒకసారి వేతనాలను పెంచేవారు. ఆ తర్వాత ఐదేళ్లకోసారి కూడా జీతాలు పెరగడం కష్టమైంది. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే మీరే న్యాయం చేయాలి.
– ఆర్.ఎం.అప్పలనాయుడు, జిందాల్ కార్మికుడు
Comments
Please login to add a commentAdd a comment