
పెన్షనర్లకు సర్కారు వెన్నుపోటు
పెన్షనర్లను ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన ‘అదనపు పెన్షన్’ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది.
- అదనపు పెన్షన్ సిఫారసును విస్మరిస్తూ జీవో
- 75 ఏళ్ల వయసు దాటితే 15 శాతం అదనపు పెన్షన్ సౌకర్యం
- దాన్ని 70 ఏళ్లకు తగ్గించాలని సిఫారసు చేసిన పదో పీఆర్సీ
- పట్టించుకోని ప్రభుత్వం .. ఇప్పటికే పొందుతున్న వారికి..
- పీఆర్సీ అమలు వల్ల తగ్గనున్న పెన్షన్
- పెన్షనర్లకు 43 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్: పెన్షనర్లను ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. పదో వేతన సవరణ సంఘం సిఫారసు చేసిన ‘అదనపు పెన్షన్’ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఉద్యోగులకు అమలు చేసిన విధంగా పెన్షనర్లకు 43 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ‘అదనపు పెన్షన్’ను విస్మరించాలని పేర్కొనడంతో లక్షలాది పెన్షనర్లకు నష్టం వాటిల్లనుంది.
అదనపు పెన్షన్ అంటే..
పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ ఖర్చులు పెరుగుతాయని, అందుకు అనుగుణంగా పెన్షన్ పెంచుతారు. 5వ వేతన సం ఘం.. 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ మంజూరు చేయాలని సూచించింది. ఈ అదనపు పెన్షన్‌ను బేసిక్ పెన్షన్‌లో కలపాలని, దాని మీద డీఏ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులు ప్రస్తుతం అమలవుతున్నాయి.
అదనపు పెన్షన్ అర్హత వయసు తగ్గింపు
అదనపు పెన్షన్ అర్హత వయసును పదో పీఆర్సీ తగ్గించింది. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు 15 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేసింది. 2013 జూలై 1 నాటికి ఉన్న 63.344 శాతం ఉన్న డీఆర్, ఫిట్‌మెంట్‌ను బేసిక్ పెన్షన్‌లో విలీనం చేసిన తర్వాత నిర్ధారించే కొత్త పెన్షన్ మీద అదనపు పెన్షన్‌ను గణించాలని సూచించింది.
తాజా జీవో ఏం చెబుతోంది
కొత్త పెన్షన్ గణింపులో ‘అదనపు పెన్షన్’ను విస్మరించాలని శుక్రవారం జారీ చేసిన జీవో 51లో పేర్కొన్నారు. 9వ పీఆర్సీ సిఫారసులకు అనుగుణంగా ఇప్పటికే అదనపు పెన్షన్ పొందుతున్న వారికి ఈ జీవో అమలు చేస్తే, పెన్షన్ మొత్తం పెరగాల్సింది పోయి తగ్గుతుందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవోలోని మిగతా ముఖ్యాంశాలు..
కొత్త పెన్షన్లు 2013 జూలై 1 నుంచి నోషనల్‌గా(పెంపు కాగితాలకే పరిమితం) అమలవుతాయి. 2014 జూలై 2 నుంచి ఆర్థిక లబ్ధి అమల్లోకి వస్తుంది. అప్పటి నుంచి 2015 మార్చి వరకు 9 నెలల బకాయిలను ఎలా చెల్లించాలనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
2013 జూలై 1 నాటికి ఉన్న బేసిక్ పెన్షన్+ 43 శాతం ఫిట్‌మెంట్+ 63.344 శాతం.. గణించి కొత్త బేసిక్ పెన్షన్ నిర్ణయిస్తారు. కొత్త పెన్షన్ మీద 8.908 శాతం డీఆర్(కరువు భృతి) అమలవుతుంది.
కనీస పెన్షన్ రూ. 3,350 నుంచి రూ. 6,500కు పెరగనుంది. సొంత పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్.. రెండూ పొందుతున్న వారు, పెంచిన మేరకు కనీస పెన్షన్లు పొందడానికి అర్హులే.
అదనపు పెన్షన్ చెల్లింపు సిఫారసు ఇలా..
వయసు అదనపు
(సంవత్సరాల్లో) పెన్షన్ శాతం
70 - 74 15
75 - 79 25
80 - 84 35
85 - 89 45
90 - 94 55
95 - 99 65
100, ఆపైన 75