సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సేవలు స్తంభించిపోతే విద్యుత్ శాఖ మాత్రం వినియోగదారులకు బిల్లుల రూపంలో ‘షాక్’ ఇస్తోంది. ఉద్యమం పుణ్యమా అని రెండు నెలలకు కలిపి ఒకే బిల్లు ఇస్తున్నారు.
సాధారణంగా ప్రతి నెలా వాడే విద్యుత్‌కు రీడింగ్ తీస్తారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల ఆగస్టులో వాడిన విద్యుత్ రీడింగ్ తీయలేదు. బిల్లులు ఇవ్వలేదు. కొన్ని చోట్ల బిల్లులు ఇచ్చినా.. కట్టించుకోలేదు. ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల రీడింగ్ తీయడంతో స్లాబ్ మారిపోయి బిల్లులో అత్యధిక విద్యుత్ రీడింగ్ జరిగినట్లు వినియోగదారుల చేతికి బిల్లులు ఇచ్చి కంగుతినిపిస్తున్నారు.
ఈ డబుల్ ధమాకా బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు బాదుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై జూలై 30న కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసిన వెంటనే జిల్లాలో సమైక్యవాదులు ఉద్యమ బాటపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి ఉద్యమ బాటపట్టారు. దీంతో జిల్లా విద్యుత్ శాఖలో సేవలు స్తంభించిపోయాయి. ప్రతి నెలా 2వ తేదీ నుంచి 11వ తేదీ లోపు ఇళ్లకు వెళ్లి రీడింగ్ తీసి.. వినియోగదారులకు బిల్లులు అందజేసే సిబ్బంది ఉద్యమంలో ఉండడంతో వినియోగదారులకు బిల్లులు అందలేదు. అయితే గడువు పూర్తయినా విద్యుత్ బిల్లులు అందకపోవడంతో వినియోగదారుల్లో దడ మొదలైంది. రెండు నెలలకు సంబంధించిన రీడింగ్ ఒకేసారి తీస్తే.. స్లాబు మారిపోయి బిల్లులు అధిక మొత్తంలో వస్తాయని భయాందోళన వ్యక్తం చేశారు.
వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమణమూర్తి, విద్యుత్ జేఏసీ నాయకులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి.. ‘జిల్లాలో విద్యుత్ వినియోగదారులు బిల్లులపై భయపడాల్సిన అవసరం లేదు. సిబ్బంది సమైక్య ఉద్యమంలో ఉన్నందున బిల్లులు అందజేయలేకపోతున్నాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిల్లులు అందజేసే సమయంలో ఏ నెలకు సంబంధించి ఆ నెల బిల్లును సరాసరి వేసి.. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఫైన్ కూడా చెల్లించాల్సిన అవసరం లేద’ని స్పష్టం చేశారు. అయితే విద్యుత్ ఉద్యోగులు ఉద్యమంలో పాల్గొంటూనే విధులకు కూడా హాజరౌతున్నారు. దీంతో ఈ నెల మొదటి వారం నుంచి బిల్లులు పంపిణీ చేస్తున్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ, జేఏసీ నాయకులు చెప్పిన మేరకు కాకుండా.. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన రీడింగ్ కలిపి తీస్తుండడంతో స్లాబులో తేడాలు వచ్చి.. బిల్లులు పేలిపోతున్నాయి.
స్లాబు ఇలా..
విద్యుత్ వినియోగంలో స్లాబులు మారే కొద్దీ బిల్లు పెరుగుతుంది. 50 యూనిట్ల వరకు రూ.1.45 ఉండగా 100 నుంచి 199 వరకు రూ.2.80, 200 నుంచి రూ.3.05 పైసలు ఇలా.. ప్రతి వంద యూనిట్లకు సరాసరి రూపాయి పెరుగుతుంది. అయితే విద్యుత్ ఉద్యోగులు చెప్పిన మేరకు ఆగస్టు నెలకు సంబంధించి యావరేజ్ యూనిట్లు వేసి బిల్లు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రీడింగ్‌ను తీస్తుండడంతో విద్యుత్ వినియోగం అధికంగా జరిగినట్లు రీడింగ్‌లో చూపిస్తోంది. దీంతో స్లాబు మారిపోయి వేలకు వేలు బిల్లులు వచ్చి పడుతున్నాయి.
ఏమీ చేయలేము..
బిల్లులు అధికంగా వస్తున్నాయంటే మేము ఏమీ చేయలేము. ఆగస్టు నెలకు సంబంధించి తొలుత కొన్ని బిల్లులకు యావరేజ్ యూనిట్లు వేసి ఇచ్చాము. అయితే సిబ్బంది ఈ నెల 4 తరువాత తిరిగి సమ్మెలోకి వెళ్లడంతో కాస్త ఇబ్బంది కలిగింది. దీంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి రీడింగ్ తీసి ఇస్తున్నారు. దీంతో బిల్లులు అధికంగా వస్తుంటాయి. దీనికి మేము ఏమీ చేయలేము. బిల్లులు చెల్లించక తప్పదు. అయితే ఈ నెలలో ఎక్కువ బిల్లు చెల్లించినా వచ్చే నెల బిల్లులో ఈ మొత్తం అడ్జస్టు అవుతుంది.
- రమణమూర్తి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, అనంతపురం
తడిసి మోపెడు!
Published Sun, Sep 22 2013 2:35 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement