కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై ఎలుగెత్తిన ఉద్యోగి | Government employees protest on Contributor Pension Scheme | Sakshi
Sakshi News home page

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌పై ఎలుగెత్తిన ఉద్యోగి

Published Thu, Nov 16 2017 4:10 AM | Last Updated on Thu, Nov 16 2017 4:12 AM

Government employees protest on Contributor Pension Scheme - Sakshi

బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద చలో అసెంబ్లీకి వచ్చిన ఉద్యోగులను అరెస్టు చేసి వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తున్న పోలీసులు

సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం దక్కే పెన్షన్‌ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు. ఓ ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువులు పూర్తి కావాలన్నా, భవిష్యత్తు సాఫీగా గడిచిపోవాలన్నా ఎంతో మందికి అదే ఆధారం. ఓ ఉద్యోగి జీవితంలో అనుకోని ఉపద్రవాలు సంభవించినా ఆ కుటుంబాన్ని చివరకు ఆదుకునేది కూడా అదే. తమ ఆశలను ఛిద్రం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌  విధానం (సీపీఎస్‌)పై రాష్ట్రవ్యాప్తంగా 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. తమ భవిష్యత్తును అంధకారం చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌) స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్రంపై నెపం వేసి తప్పించుకునేందుకు దారులు వెతుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ఉద్యమించాలని నిర్ణయించారు.చాలా రోజులుగా వినతిపత్రాలు, ధర్నాలు, మౌన ప్రదర్శనలు, నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడలో వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.  

సీపీఎస్‌ మొగ్గ తొడిగింది బాబు జమానాలోనే 
లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును చీకటిమయం చేసే సీపీఎస్‌ విధానం గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సిద్ధమైంది. 2003కి ముందు టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉన్న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రూపొందించింది. అయితే దీన్ని అమలు చేయాలా వద్దా..? అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించి తన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం ఈ నూతన పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ఈ విధానం పలు దేశాల్లో విఫలమైంది. ఎన్డీఏ  ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నూతన పెన్షన్‌ విధానం బిల్లును పార్లమెంటులో ఆమోదించటం ఉద్యోగులకు అశనిపాతంగా పరిణమించింది.  

బెంగాల్, త్రిపురలో నేటికీ పాత విధానమే... 
2004 జనవరి 1వతేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్‌ విధానాన్ని వర్తింపచేశారు. ‘‘రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడం, చేయకపోవడం వాటి ఇష్టం’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం చాలా లోపభూయిష్టమైనదని, ఉద్యోగుల చరమాంక జీవితానికి ఏమాత్రం భరోసా ఇవ్వదని  పార్లమెంటులో గొంతెత్తిన వామపక్షాలు వాటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో నూతన పెన్షన్‌ విధానాన్ని అమలు చేయలేదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఇప్పటికి పాతపెన్షన్‌  విధానమే అమలవుతుండటం గమనార్హం.

ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు   


ఉద్యోగుల ప్రయోజనాలకు గండి 
ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్‌ 10 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ (సీపీఎస్‌)విధానాన్ని వర్తింపచేశారు. ఉద్యోగులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 1980 నాటి పెన్షన్‌ నిబంధనలు, వాటిలోని ప్రయోజనాలు సీపీఎస్‌ విధానంలో వర్తించవు. 1980 పెన్షన్‌ నిబంధనల ప్రకారం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, మరణానంతర ప్రయోజనాలనేకం ఉద్యోగులకు సమకూరాయి. కొత్త పెన్షన్‌ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల జీవితం గాలిలో దీపంలా మారనుంది.  

రూ. వందల్లోకి పెన్షన్‌ కుదింపు.. 
ఉదాహరణకు పాత పెన్షన్‌ విధానంలో ఓ ఉద్యోగి బేసిక్‌ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 66,330 ఉంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 33,165 పెన్షన్‌గా అందుతుంది. 40 శాతం కమ్యూటేషన్‌ చేసినా మిగిలిన మొత్తం రూ. 19,899తో పాటు డీఏ, మెడికల్‌ అలవెన్సులు కలిపితే రూ. 27,398 పెన్షన్‌గా అందేది. అదే కొత్త పెన్షన్‌ విధానంలో ఒక ఉద్యోగి పెన్షన్‌ ఖాతాలో అక్టోబర్‌ నెలలో రూ. 4,93,564 ఉన్నాయనుకుంటే ఆ మొత్తం పెట్టుబడిగా పెడితే  నెల చివరికి రూ. 4,95,888 అవుతోంది. అంటే పెరిగిన ఆదాయం రూ.2,324 మాత్రమే. ఈ లెక్కన ఉద్యోగికి వచ్చే పెన్షన్‌ నెలవారీ వందల్లోనే తప్ప అంతకు మించి అందదు. ఇక ఎవరైనా ఉద్యోగి చనిపోతే షేర్‌ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్‌ రాదు. పాత పద్దతిలో అయితే  చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం + దానిపై డీఏ వచ్చేది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్‌ విధానంతో తమ కుటుంబాలు ఎలా బతకాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పెన్షన్‌ లేకపోవడం, కమ్యూటేషన్‌ తొలగించటం, ఇతర ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏమిటని ఆక్రోశిస్తున్నారు.
 
మండలిలో నిలదీసిన టీచర్‌ ఎమ్మెల్సీలు 
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కత్తినరసింహారెడ్డి, వై.శ్రీనివాసులురెడ్డి, రామసూర్యారావులు బుధవారం శాసనమండలిలో సీపీఎస్‌ రద్దు కోసం ఏకవాక్య తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సభను స్తంభింపచేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ పోడియం ముందు బైఠాయించారు. లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్య పై చర్చించకపోవడం అన్యాయమని, తమ గోడును వెళ్లబోసుకొనేందుకు అసెంబ్లీకి వస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను ముందురోజు నుంచే అరెస్టు చేయడం అన్యాయమని ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేస్తామని  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినందున ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని  మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసనగా సభనుంచి వాకౌట్‌ చేశారు. ఈనెల 20వ తేదీన శాసనమండలి, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటంలో ప్రత్యక్షంగా  పాల్గొంటామని ప్రకటించారు. 

మహిళ ఉద్యోగులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు 

 
పాత పెన్షన్‌ విధానంలో ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవీ
- ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్‌ అయిన తర్వాత నిర్ధిష్టమైన పెన్షన్‌ నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డీఏ, పీఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతినెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంతవరకు పెన్షన్‌ ఇవ్వటంతోపాటు చనిపోయిన తరువాత ఉద్యోగి భార్యకు పెన్షన్‌ చెల్లిస్తారు. ఆ పెన్షన్‌  బాధ్యత ప్రభుత్వానిదే. 
ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్‌  చెల్లిస్తారు ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది. 
ఉద్యోగి అవసరాలకోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జీపీఎఫ్‌ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సొమ్ముపై ప్రతి నెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవసరమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. 
పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్‌ కార్డుల సదుపాయం ఉంది.  
తన శక్తి సామరŠాధ్యలను ప్రభుత్వ సేవకి వినియోగించినందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా  ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది. 
పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్‌ నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యుటేషన్‌ అంటారు. 
ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు. 
 
కొత్త విధానంలో అన్నిటికీ కోతే
పదవీ విరమణ అనంతరం పెన్షన్‌ గురించి ఉద్యోగే చూసుకోవాలి. దీనికోసం ఉద్యోగి తన సర్వీసు ప్రారంభం నుంచే జీతంలో ప్రతి నెలా 10 శాతం సొమ్ము పొదుపు చేసుకోవాలి. దీనికి ప్రభుత్వం అంతే మెత్తం జమచేసి ఎన్‌ఎస్‌డీఎల్‌ అనే సంస్థ ద్వారా షేర్‌ మార్కెట్లలో వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. పదవీ విరమణ సమయంలో లాభనష్టాలు పోనూ మిగిలిన సొమ్ములో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. దీనిపై ఉద్యోగి పన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం సొమ్ము మళ్లీ షేర్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలతో పెన్షన్‌  ఇస్తారు. ఇది ఎంత అనేది నిర్ధిష్టంగా ఉండదు. షేర్‌ మార్కెట్లలో నష్టాలు వస్తే పెన్షన్‌ తగిపోతుంది. ఒకవేళ పెన్షన్‌ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఫ్యామిలి పెన్షన్‌ అందదు. ఆ కుటుంబం వీధుల పాలు కావాల్సిందే. 
ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు పదవీ విరమణ సమయంలో ఇచ్చే ్రగ్రాట్యుటీ సదుపాయం లేదు. అయితే దీన్ని ఇచ్చేందుకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరించి జీవో ఇచ్చింది. 
- రిటైరయిన తరువాత ఉద్యోగి హెల్త్‌ కార్డులపై స్పష్టత లేదు. 
ఉద్యోగులకు కమ్యుటేషన్‌ సదుపాయం లేదు. 
పాత పెన్షన్‌ విధానంలో మాదిరిగా ఆపదలో ఆదుకోనే జీపీఎఫ్‌ లోన్‌ సదుపాయం ఉద్యోగులకు లేదు. 

ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ భగ్నం
భవానీపురం(విజయవాడ): కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎస్‌)ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచే అన్ని జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. బస్సులు, రైళ్లలో బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడ, గుంటూరుల్లో భారీగా పోలీసులను మోహరించటంతోపాటు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీకి వచ్చే అన్ని దారుల్లోనూ నిఘా వేశారు. విజయవాడకు చేరుకున్న వేలాది మందిని అడ్డుకొని సుదూరంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఫ్యాప్టో లోని అన్ని సంఘాల రాష్ట్ర నేతలు, జిల్లాల నేతలను పోలీసులు అరెస్టుచేసి రాత్రి వరకు నిర్బంధించారు.

విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరేందుకు 13 జిల్లాల నుంచి ఉద్యోగులు ఉదయమే కళాక్షేత్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కిందపడిపోయిన మహిళా మహిళలను నిర్దాక్షిణ్యంగా ఎత్తి వ్యాన్‌లలో పడేశారు. సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పెన్షన్‌ స్కీం విధానాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ దమననీతి నశించాలని, సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.  

పోలీసుల అత్యుత్సాహంపై ఉద్యోగులు మండిపడ్డారు. సీపీఎస్‌ విధానం రద్దు కోరేది తమ ఒక్కరి కోసమే కాదని, అది మీకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఆడామగా తేడా లేకుండా విచక్షణా రహితంగా ప్రవర్తించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తమైంది. ఒక దశలో కార్యక్రమాన్ని కవర్‌ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలలేదు. ఒక ఛానల్‌ రిపోర్టర్‌ పొట్టలో పిడిగుద్దులు గుద్దారు. మరికొంతమందిపైనా దౌర్జన్యం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement