రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపేటలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నంబర్ 262 ప్రకారం పట్టిసీమ ప్రాంతంలో భూ రిజిస్ట్రేషన్ విలువ రూ.5 లక్షలు ఉన్న భూములకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు పరిహారం అందించిందని తెలిపారు. అదే ప్రభుత్వం భోగాపురంలో రిజిస్ట్రేషన్ విలువ రూ.10 లక్షలు ఉన్న భూములకు మాత్రం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలే ఇస్తామనడం దారుణమన్నారు. రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపడుతున్న ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని నాగిరెడ్డి తెలిపారు.