
గంగమ్మ తల్లీ ... గండం గట్టెక్కించు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : హుదూద్ పెను తుపానై దూసుకొస్తోంది. సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నాయి. కెరటాలు తీరప్రాంత గ్రామాల్లోని ఇళ్ల గోడలకు తాకుతున్నాయి. మునుపెన్నడూలేని విధంగా పరిస్థితులు కన్పిస్తుండడంతో మత్స్యకార గ్రామాలు వణికిపోతున్నాయి. తుపాను వల్ల జరిగే నష్టాన్ని తలచుకుంటూ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపో తున్నారు. ఈ కష్టం నుంచి కాపాడమని కని పించిన దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. మత్స్యకారులు గంగమ్మతల్లినే నమ్ముకున్నారు. కూడు పెట్టిన నీవే ఇలా ఉగ్రరూపం దాల్చితే తామేమైపోవాలని వేడుకొంటున్నారు. శాంతి కరుణించాలని మొక్కుకుంటున్నారు.
ఇళ్లను తాకిన అలలు
శనివారం నుంచి సముద్రం అల్లోకల్లలంగా కనిపించింది. నాలుగైదు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. 30 నుంచి 40 అడుగుల మేర కెరటాలు దూసుకొచ్చాయి. ఎప్పడూలేని విధంగా గ్రామాల్ని తాకాయి. పూసపాటిరేగ మండలం తిప్పవలస వద్ద సముద్రం దాదాపు 40 అడుగుల ముందుకొచ్చింది. పతివాడ బర్రిపేట కూడా కెరటాల తాకిడికి గురైంది. దీంతో సముద్రం ఒడ్డున లంగరు వేసిన 70 పడవలు చిక్కుకున్నాయి. వాటిలో విలువైన వలలు ఉన్నాయి. వాటిని గ్రామంలోకి తీసుకువచ్చేందుకు యత్నించిన మత్స్యకారులు విఫలమయ్యారు. భోగాపురం మండలం ముక్కాం, చేపలకంచేరులో సముద్రం దూసుకొచ్చి ఇళ్ల గోడలను తాకింది. ముక్కాంలో 180 పూరిళ్లు ఉండడంతో పెనుగాలికి ఎగిరిపోయే ప్రమాదం ఉండడంతో ఎప్పుడేప్రమాదం చోటు చేసుకుంటుందోనని వారంతా భయపడుతున్నారు. హుదూద్ ప్రభావంతో వీస్తున్న బలమైన ఈదురు గాలులకు చెట్లు ఊగిపోతున్నాయి. చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకు తగ్గట్టుగా పునరుద్ధరణ చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
పొంగి ప్రవహిస్తున్న నాగావళి
ఒడిశా, శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నాగావళిలో నీటి ప్రవాహం పెరిగింది. క్రమేపి పోటెత్తే అవకాశం ఉండటంతో పార్వతీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అధికారులు ఇప్పటికే ఆమేరకు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావంతో కనిష్టంగా ఆరు సెంటీమీటర్ల నుంచి గరిష్టంగా 26సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఇళ్లు వదలబోమంటున్న మత్స్యకారులు
లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ముప్పు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజ ల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రత్యేక ఆదేశాలొచ్చాయి. అం దుకు తగ్గట్టుగా 12పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 వేల మందికి సరిపడా వసతుల్ని కల్పించారు. కానీ మత్స్యకారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. తుపానులు కొత్తేమి కాదని, ఉన్న ఊరిని, సొం తిళ్లు వదిలి కదిలేది లేదని మత్స్యకారులు మొండికేస్తున్నారు. గంగమ్మే చూసుకుంటుందని అంటున్నారు. దీంతో అధికారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో కొందర్ని బలవంతంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి అతి కష్టం మీద నాలుగు వేల మందిని తరలించారు. కానీ వారంతా భోజనం చేసేసి మళ్లీ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంతానికి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి. పది మంది చొప్పున గ్రూపుగా ఏర్పడి ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది గ్రామాలలో మొహరించారు. ఆర్మీ బలగాలు సహాయకచర్యలకు సిద్ధమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు.