కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్.ఎస్.బ్రహ్మ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోనిదే ఈ విషయంలో ఎన్నికల సంఘం ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు ఇటీవల జీవోఎంను కలిసి విజ్ఞప్తి చేయడం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ స్థానాలకు అదనంగా 34 స్థానాలను పెంచాలని టీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో సీట్ల పెంపు విషయమై శనివారం తనను కలిసిన ఓ మీడియా చానల్‌తో బ్రహ్మ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 294 అసెంబ్లీ స్థానాలున్నాయని, సీట్లను పెంచాల్సి వస్తే ఆంధ్ర, తెలంగాణలో.. రెండు చోట్లా పెంచాలి కదా అని అన్నారు. అయితే సీట్లు పెంచుతారా? లేదా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. ఒక ప్రాంతంలో సీట్లను పెంచడం సాధ్యమేనా? అన్న ప్రశ్నకు.. సీట్ల పెంపుపై కేంద్రం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని, కేబినెట్ నిర్ణయం తర్వాత చేసుకోవచ్చని ఆయన బదులిచ్చారు. రాష్ట్ర విభజన జరుగుతుందా? లేదా? అనేది తాను సరిగ్గా చెప్పలేనన్నారు. ఇందుకు చాలా ప్రక్రియ... సమయం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.