ధర్మాస్పత్రిపై అధర్మవేటు!
- చిత్తూరు ప్రభుత్వాస్పత్రి ఇక ప్రైవేటుపరం
- వైద్యశాల పరిశీలనకు నేడు కమిటీ రాక
- పేదలకు దూరం కానున్న వైద్యం
- అన్ని సేవలకూ ఫీజుల మోత తప్పదు
- పేదలు, వైద్యవర్గాల్లో ఆందోళన
సాక్షి,చిత్తూరు/చిత్తూరు అర్బన్ : గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి ఉన్నపుడు చిత్తూరు విజయా డెయిరీ మూతపడింది. మళ్లీ ఆయన పదవిలోకి ఏడాది పూర్తి కాకనే చిత్తూరు షుగర్‌స మూతపడేట్లు చేశారు. తాజాగా ప్రభుత్వాస్పతిని కూడా ప్రయివేటు పరంచేసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉచిత వైద్యసేవలు అందించడమే ధ్యేయమని చెప్పిన చంద్రబాబు మాట తప్పారు. చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అపోలో వైద్య సంస్థలకు అప్పగించడానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.
ఇక్కడున్న ఆస్పత్రిని అపోలో సంస్థలు ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీకి క్లీనికల్ అటాచ్‌మెంట్ ఇవ్వాలని ఆ సంస్థ అడగటం.. ప్రభుత్వం సైతం అంగీకరించడం తెలి సిందే. దీంతో గురువారం ఆస్పత్రిలోని అధికారులు ప్రభుత్వం అడిగిన నివేదిక ఇవ్వడంలో నిమగ్నమయ్యారు.
300 పడకలు, రోజులు వెయ్యి మందికిపైనే అవుట్ పేషెంట్లు, 17 ఎకరాల సువిశాల స్థలం ఉన్న చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం 14 విభాగాలున్నాయి. ఎక్స్‌రే, డిస్పెన్సరీ, ఆపరేషన్ థియేటర్లు, కంటి విభాగం, ప్రసూతి విభాగం, కుష్ఠు వ్యాధి నివారణ వార్డు, జీఈ షెడ్డు, రోగులకు భోజనం అందించే విభాగం, నర్శింగ్ క్వార్టర్స్, క్షయ వార్డు, పోస్టుమార్టం విభాగం, ఇటీవల నూతనంగా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన మాతా, శిశు సంరక్షణ కేంద్ర భవనం, ఎంపీహెచ్‌డబ్ల్యూ శిక్షణ కేంద్రం, ఆయుర్వేదిక్, ఏఆర్‌టీ సెంటర్లు ఆస్పత్రిలో ఉన్నాయి. మొత్తం ఆస్పత్రి 2.65 లక్షల చదరపు అడుగుల్లో భవనాలు ఉన్నాయి. ఇన్ని వసతులున్న ఆస్పత్రిలో ప్రైవేటు సంస్థకు చెందిన శిక్షణ వైద్యులు ప్రవేశిస్తారు.
రోగుల జబ్బులపై ప్రయోగాలు చేయడం, పోస్టుమార్టం గదిలో మృతదేహాలకు శవపరీక్షలు చేసి శిక్షణ పొందడం లాంటివి చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి అంగీకరించిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిని మూడేళ్ల తరువాత ఖాళీ చేస్తారా..? చేయకుంటే పరిస్థితి ఏమిటి..? అనే విషయాలపై అధికారుల వద్ద, ప్రజాప్రతినిధుల వద్ద సరైన సమాధానాలు లేవు.
ఉద్యోగులపై ఆరా...
మరోవైపు ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, వారికి నెలసరి ఇచ్చే జీత భత్యాలు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు, వారి పనితీరు ఎలా ఉందనే అంశాలను సైతం వెంటనే సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించింది. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడేళ్ల నివేదికను ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉద్యోగులకు ఇక నుంచి ప్రభుత్వం జీత భత్యాలు చెల్లిస్తుందా..? మరో ప్రాంతానికి బదిలీ చేస్తుందా..? అపోలో సంస్థలకు తమనూ అప్పగిస్తుందా..? అనే ప్రశ్నలతో వైద్యులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పేదల వైద్యానికి పాతర
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని అపోలోకు అప్పగిస్తే పేదలకు వైద్యసేవలు అందే పరిస్థితి ఉండదని వైద్య ఉద్యోగులు,యూనియన్ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో రోజుకు వెయ్యి మందికి తగ్గకుండా వైద్యసేవలు పొందుతున్నారు. అపోలో చేతుల్లోకి వెళితే వైద్య సేవల కోసం వచ్చే పేదల నుంచి ముక్కుపిండి కనీస ఫీజులు వసూలు చేయనున్నారు. ముఖ్యంగా సీటీ స్కాన్,ఈసీజీ,ఎండో స్కోప్,ఎక్సరే తదితర టెస్ట్‌లకు అధిక ఫీజులు వసూలు చేస్తారు. పేద,మధ్యతరగతికి చెందిన రోగులకు కష్టాలు తప్పవని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.
చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి 166ఏళ్లు
చిత్తూరు ఆసుపత్రికి పెద్ద ఘనచరిత్రే ఉంది. ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగి ఇప్పటికి 166 సంవత్సరాలు. 1849 లో ఒక చిన్న డిస్పెన్షరిగా ఓ ప్రైవేటు బిల్డింగులో ఈ ఆసుపత్రి ప్రారంభమైంది. 1867లో ఆసుపత్రికి ప్రభుత్వం సొంతభవనాన్ని నిర్మించింది. 1919 వరకు లోకల్ బోర్డు ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్వహణను చేపట్టింది. ప్రస్తుతం 320 పడకల ఆసుపత్రిగా చిత్తూరు ఆసుపత్రి రూ పాంతరం చెంది రోజూ వెయ్యిమంది పేదలకు వైద్యసేవలు అందిస్తోంది. ప్రస్తుతం 177మంది రెగ్యులర్ ఉద్యోగులుండగా, 10 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, మరో పదిమంది ఔట్‌సోర్సింగ్ ఉ ద్యోగులు పనిచేస్తున్నారు. మరో 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఈఆస్పత్రిలో 252మంది ఉద్యోగ పోస్టులున్నా యి. ఇంత చరిత్ర కలిగిన ప్రజావైద్యశాలను ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాల ని పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెతుతున్నాయి.