కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులతో పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అయితే వారిని తిరిగి అవుట్‌సోర్సింగ్ పద్దతిలో నియమించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ సైతం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ నియామకాలకు స్వస్తి చెప్పి కాంట్రాక్టు విదానంలో పోస్టుల భర్తీకి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. దీంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2002 నుంచి వివిధ విభాగాల్లో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో రెగ్యులర్ నియామకాలు గాకుండా కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తూ వెళ్తున్నారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిలో 120 మందికి పైగా ఉద్యోగులను నియమించారు.
వారిలో ఆసుపత్రి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 34 మందితో పాటు 14 మంది పంప్ ఆపరేటర్లు, కార్డియాలజిలో నలుగురు వార్డుబాయ్‌లు, నలుగురు స్వీపర్లు కలిపి 54 మంది పనిచేస్తున్నారు. వారికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నుంచి అధికారులు జీతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను కేవలం అభివృద్ధికి మాత్రమే వాడాలని, ఉద్యోగులను నియమించి జీతాలు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల ఆసుపత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న 58 మందిని ఈ నెలాఖరులోగా తీసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారిని ఉన్నఫలంగా ఉద్యోగంలో నుంచి తీసేయకుండా వారిని అవుట్ సోర్సింగ్ పద్దతిలో తిరిగి నియమించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో ఆసుపత్రి అధికారులు చర్చించారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా తమను తొలగించి, అవుట్‌సోర్సింగ్ ద్వారా నియమిస్తే ఇన్నేళ్లుగా తాము చేసిన సర్వీస్ పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాము సమ్మె చేస్తూ లేబర్ కోర్టుకు వెళతామని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కుమార్ చెప్పారు.