సాక్షి, నిజామాబాద్: ఈ ఇబ్బంది ఫాతిమా తల్లి ఒక్కరిదే కాదు.. నిత్యం వందల సంఖ్యలో ఆస్పత్రికి వచ్చే రోగులందరికీ దాదాపు ఇలాంటి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఈ ఆస్పత్రికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, బాసర వంటి ప్రాంతా ల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ఇ క్కడ కనీసం సైన్ బోర్డులు లేవు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆస్పత్రికి ఎనిమిదంతస్తుల భవనం నిర్మించారు. వందకుపైగా గదులున్న ఈ భవనంలో పదుల సంఖ్యలో విభాగాలను ఏర్పాటు చేశారు. ఆ గదులకు తెలుగులో బోర్డులు పెట్టడం మరిచిపోయారు. అక్కడక్కడ ఇంగ్లిష్‌లో బోర్డులు ఉన్నా అవి ఎవరికీ అర్థం కావు.
దీంతో వైద్యం సంగతి దేవుడెరుగు ఏ గది ఎక్కడుందో.. తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. 108, ఇతర ఆంబులెన్స్‌లలో వచ్చే రోగులను సిబ్బంది నేరుగా అత్యవసర విభాగానికి తీసుకెళతారు. నేరుగా వచ్చినవారి పరిస్థితి దారుణంగా ఉంటోంది. వారు చేరుకోవాల్సిన విభాగం కోసం కనీసం పావు గంట తిరగాల్సివస్తోంది. సిబ్బందిని అడిగితే కొందరు విసుక్కుంటున్నారని రోగులు వాపోతున్నారు. అత్యవసర చికిత్సకు సమయం ఎంత విలువైందో వైద్యులకు, అధికారులకు తెలియంది కాదు. అయినా ఆస్పత్రిలో బోర్డులు పెట్టాలన్న ఆలోచన వారికి రావడం లేదు. ఫలితంగా రోగులు, వారి సహాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆస్పత్రి బయటా అంతే
ఆస్పత్రి ఆవరణలోకి రాగానే ప్రధాన ద్వారం, దానిపక్కనే మరో ద్వారం ఉంటుంది. అత్యవసర విభాగమైన ఈ రెండో ద్వారానికి బయటకు కనిపించేలా అసలు బోర్డ్డే పెట్టలేదు. రోగులు ప్రధాన ద్వారం గుండా లోనికి వెళితే అక్కడ ఇంగ్లిష్‌లో బోర్డులున్నాయి. వైద్య పరిభాషలో ఉండే ఈ బోర్డులు సామాన్యులకు ఎలా అర్థమవుతాయో అధికారులకే తెలియా లి. బోర్డులు తెలుగులో ఉంటే ఈ ఇబ్బందులు తప్పే అవకాశాలున్నాయి.
ఎక్కడ ఏ మందులిస్తరో!
మద్యానికి అలవాటు పడి అనారోగ్యానికి గురైన నా కొడుకు రామాజీని చికిత్స కోసం ఇక్కడికి తీసుకొచ్చిన. పెద్ద భవంతిలో ఎక్కడ మందులిస్తరో.. ఎక్కడ సూది ఇస్తరో తెలుస్తలేదు. ఇంగ్లిషుల బోర్డులున్నయి. ఇక్కడున్నోళ్లను అడిగితే మాకు తెలువదంటున్నరు. సార్లనడిగితే ఒక్కోసారి చెబుతున్నరు. ఒక్కోసారి విసుక్కుంటున్నరు. ప్రస్తుతం నా కొడుకుకు ఎమర్జెన్సీ వార్డులో వైద్యం చేస్తున్నరు.
- రాములు, బాన్సువాడ
తిరిగి తిరిగి కాళ్లు గుంజుతున్నయి
కడుపులో గడ్డ అయిందంటే నా భర్త ఇక్కడికి తీసుకచ్చిండు. సోమవారం ఆపరేషన్ చేస్తమన్నరు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఏది ఎక్కడుందో తెలుస్తలేదు. ఒక్కోసారి తిరిగి తిరిగి కాళ్లు గుంజుతున్నయి. అడిగితే కొందరు విసుక్కుంటున్నరు. తెలుగులో బోర్డులుంటే ఎవరైనా చెప్పేవారు.
- సర్దేవార్ లక్ష్మి, లక్ష్మాపూర్, మద్నూర్ మండలం
ఇంగ్లిషులున్నయి..ఎట్ల తెలుస్తది
నా కొడుకు రవికి కిడ్నీల్లో సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన. డాక్టర్లు చికిత్స చేస్తున్నరు. వివిధ పరీక్షలు చేయాలన్నరు. బోర్డులు లేకపోవడంతో వాటి కోసం ఎక్కడ తిరగాలో తెలుస్త లేదు. కొన్నింటికి ఇంగ్లిషుల బోర్డులున్నయి. అవి మాకెట్ల అర్థమైతయి. ఎవరిని అడిగిన మాకు తెలియదు అంటున్నరు. తెలుగుల బోర్డులు ఏర్పాటు జేస్తే అందరికీ అర్థమైతది.
- సాయిలు, మంగళ్‌పాడు, ఎడపల్లి మండలం
ఇబ్బంది లేకుండా చూస్తాం
ఆస్పత్రిలో బోర్డుల సమస్య మా దృష్టికి వచ్చింది. వీటిని ఏర్పాటు చేసేందుకు మా స్థాయిలో మేం ప్రయత్నాలు చేస్తాం. వైద్య విద్య డెరైక్టరేట్ (డీఎంఈ) ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. రోగులకు, వారి సహాయకులకు ఇబ్బంది లేకుండా చూస్తం.
-భీంసింగ్, మెడికల్ సూపరింటెండెంట్
పెద్దాస్పత్రిలో బోర్డుల సమస్య
Published Mon, Dec 9 2013 6:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement