హా..స్పత్రి | Government hospital in problem | Sakshi
Sakshi News home page

హా..స్పత్రి

Published Mon, Jul 13 2015 2:49 AM | Last Updated on Tue, Sep 18 2018 7:56 PM

హా..స్పత్రి - Sakshi

హా..స్పత్రి

- ప్రభుత్వాస్పత్రిలో అన్నీ సమస్యలే..
- ఒక బెడ్‌పై ఇద్దరు గర్భిణులు
- ఎక్స్‌రే తీసే వారే లేరు..
- భయంకరంగా ఎమర్జెన్సీ వార్డు
- గుండెనొప్పి వస్తే గుంటూరుకే..
లబ్బీపేట :
జిల్లాలోని 45లక్షల మంది జనాభాకు ఆరోగ్య భరోసా ఇస్తూ పెద్దదిక్కుగా నిలవాల్సిన ప్రభుత్వాస్పత్రి సమస్యల వలయంలో చిక్కుకుంది. పేరుకు పెద్దాస్పత్రే కానీ, సౌకర్యాల్లో మాత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలా ఉందని సీనియర్ వైద్యులే చెబుతున్నారు. మూడు దశాబ్దాల కిందట 412 పడకలతో ప్రభుత్వాస్పత్రి ఏర్పాటు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 750కి చేరింది. అయితే, అందుకు తగ్గట్టుగా సిబ్బందిని పెంచకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు.

గతంలో ఉన్న సిబ్బంది పదవీ విరమణ చేస్తుండగా, వారి స్థానంలో కొత్తవారిని తీసుకోకపోవడంతో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీంతో రోగులను స్ట్రెచ్చర్‌పై తీసుకెళ్లే వారు లేక బంధువులే ఆ పనిచేస్తున్నారు. రేడియో గ్రాఫర్‌ల కొరతతో ఎక్స్‌రే తీయించుకునేందుకు రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన దుస్థితి. ఇంకోవైపు వైద్యుల కొరత వేధిస్తుండగా, సౌకర్యాలు సైతం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. దీంతో నిరుపేదలకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది.
 
క్యాజువాలిటీలో సౌకర్యాలేవి?
ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వారికి సకాలంలో చికిత్స అందించాల్సిన అత్యవసర చికిత్సా విభాగంలో సరైన సౌకర్యాలు లేవు. వెంటిలేటర్‌తో పాటు పారా మీటర్స్, పల్స్ ఆక్సీ మీటర్స్ అందుబాటులో ఉండాలి. గాయాలతో వచ్చిన రోగికి అక్కడే ఎక్స్‌రే తీసే సదుపాయం, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటివి సిద్ధంగా ఉంచాలి. కానీ, ఇక్కడ అలాంటి సౌకర్యాలేమీ లేవు. పరికరాలు ఉన్నా పనిచేయవు. ఒక్కో సమయంలో ప్రాణాపాయంలో వచ్చిన రోగికి ఈసీజీ తీసేందుకు కూడా టెక్నీషియన్ అందుబాటులో ఉండడు.
 
గుండెనొప్పి వస్తే గుంటూరుకే..
మూడు దశాబ్దాల కిందట ప్రభుత్వాస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటైనా కనీస సౌకర్యాలు కల్పించలేదు. ఒక్క ఈసీజీ, డాప్లర్ ఎకో మినహా ఇతర పరీక్షలేమీ అందుబాటులో లేని పరిస్థితి. గుండె లోపాలు గుర్తించడంలో క్యాథ్‌ల్యాబ్ కీలకమైన పరికరం. అది అందుబాటులో లేకపోవడంతో గుండె వైద్యులెవరూ ఇక్కడ పనిచేసేందుకు ముందుకు రావడం లేదు. కార్డియాలజీ విభాగంలో ఒక్క వైద్యుడు కూడా లేడు. దీంతో గుండెనొప్పితో వచ్చిన వారిని గుంటూరు ఆస్పత్రికి పంపుతున్నారు.
 
ప్రసూతి విభాగంలో అన్నీ సమస్యలే..

ప్రసూతి విభాగంలో పడకల కొరత తీవ్రంగా ఉంది. పురిటి నొప్పులతో వచ్చిన వారికి కేటాయించేందుకు పడకలు లేకపోవడంతో ఒక్కో బెడ్‌పై ఇద్దరిని ఉంచుతున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. ఈ విభాగానికి గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి కూడా గర్భిణులు ప్రసవం కోసం వస్తుంటారు. ప్రస్తుతం 90 పడకలు ఉండగా, మరో 90 అవసరం ఉందని అధికారులు ప్రభుత్వాస్పత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మెటర్నరీ అసిస్టెంట్‌గా కొరత కూడా ఉంది.

 
ప్రభుత్వానికి విన్నవించాం..
ప్రభుత్వాస్పత్రిలో రేడియోగ్రాఫర్ల కొరత విషయమై అనేకసార్లు ప్రభుత్వానికి రాశాం. ఆరోగ్యశ్రీలో కొందరిని అవుట్‌సోర్సింగ్‌లో నియమించాం. సీటీ టెక్నీషియన్స్ కూడా అలాగే నియమించాం. ఎఫ్‌ఎన్‌వోలు, ఎంఎన్‌వోల కొరత ఉంది. కొత్తవారిని నియమించుకునే అవకాశం లేకపోవడంతో ఉన్న సిబ్బందితోనే రోగులకు ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం.
- డాక్టర్ యు.సూర్యకుమారి,
ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement