విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల రేట్లు అమాంతంగా పెరగడంతో వ్యవసాయ భూములను నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లుగా మార్చుతున్నారు. కొందరు రియల్టర్లు ఎటువంటి అనుమతులు లేకుండానే ప్లాట్లుగా విభజించి అమ్మకాలు సాగించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని 15 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు పెరగడంతో వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చుతున్నారు. వాస్తవానికి వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చాలంటే ముందుగా ఆర్డీఓ అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా పంచాయతీకి చలానా కట్టాలి. లేఅవుట్‌గా ఆమోదించిన పంచాయతీ తీర్మానం కాపీని ఉడా సాంకేతిక ఆమోదానికి పంపించాలి. దీంతోపాటు లేఅవుట్ స్థలంలో 10 శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. అయితే ఇవేమీ పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి కొన్న భూమిని వారి పేరు మీదునే ఉంచుతున్నారు. ప్లాట్‌లు విక్రయించిన వారికి భూములు కొన్న రైతులతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో పంచాయతీ ఆదాయం, కన్వర్షన్ ఫీజుకు గండిపడుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
ఈ వ్యవహారానికి సర్పంచులు కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తునన్నాయి. మండలంలోని గొల్లలపేట, దుప్పాడ, చెల్లూరు, నారాయణపురం, బియ్యాలపేట, మలిచర్ల, సారిక, కోరుకొండ, జొన్నవలస, ద్వారపూడి, గుంకలాం, కొండకరకాం, మున్సిపాలిటీ విలీన పంచాయతీలు గాజులరేగ, కె.ఎల్.పురం, ధర్మపురి, జమ్ము, అయ్యన్నపేట గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటికైనా కలెక్టర్, విజిలెన్స్ అధికారులు అక్రమ లేఅవుట్లపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
Published Thu, Feb 20 2014 2:26 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement