రూపాయిచ్చింటే ఒట్టు! | Government not favor to farmers | Sakshi
Sakshi News home page

రూపాయిచ్చింటే ఒట్టు!

Published Tue, Jul 28 2015 3:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రూపాయిచ్చింటే ఒట్టు! - Sakshi

రూపాయిచ్చింటే ఒట్టు!

పెండ్లమర్రి మండలం చిన్నదాసరిపల్లెకు చెందిన రైతు బత్తిన పెద్ద నాగమల్లారెడ్డి 4.33 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. భూములు కౌలుకు తీసుకుని పంట సాగు చేసుకునే వారికి సమగ్ర కౌలు రుణ అర్హత పత్రాలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో అందుకు తనకు అర్హత ఉందని దరఖాస్తు చేసుకున్నాడు. రెవిన్యూ అధికారులు కౌలు రుణ అర్హత పత్రాన్ని ఇచ్చారు. దానిని తీసుకుని పెండ్లిమర్రి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు ఫీల్డ్ ఆఫీసరు వద్దకు వెళ్లి రుణం కావాలని అడిగాడు. రేపురా.. మాపురా.. అంటూ కాళ్లరిగేలా తిప్పారు. విసుగు చెందిన ఆ రైతు బ్యాంకు రుణంపై ఆశలు వదిలేశాడు. అధిక వడ్డీకి గ్రామంలోని ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు.
 
- కౌలు రైతుల గోల పట్టని ప్రభుత్వం
- రుణ అర్హత కార్డులు ఉత్తుత్తే   
- ఈ ఏడాది 4,983 మందిని అర్హులుగా తేల్చి ఒక్కరికీ రుణమివ్వని వైనం  
- రుణాల కోసం కాళ్లరిగేలా తిరిగి బేజారెత్తిన అన్నదాత  
కడప అగ్రికల్చర్ :
రుణ అర్హత కార్డులపై కౌలు రైతులకు భ్రమలు తొలగిపోతున్నాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసినా వాస్తవంగా అవి ఎందుకూ పనికి రావని తేలిపోయింది. ఈ కారణంగా రుణ అర్హత కార్డులను తీసుకునేందుకు కౌలు రైతులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. 2015-16 సంవత్సరానికి కార్డులు జారీ చేసేందుకు ఈ ఏడాది మే నెలలో 945 రెవిన్యూ గ్రామాలలో సభలు నిర్వహించి 5,425 మంది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 437 మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. మిగిలిన 4,983 మందికి రుణాలను అందిస్తామని చెప్పారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడచినా ఇప్పటి వరకు ఒక్క కౌలు రైతుకు ఒక్క రూపాయి అందించ లేదు.

బ్యాంకర్లు పెడుతున్న తిప్పలకు రైతులు బేజారై రుణాలడగడమే మానేశారు. దీనిపై రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2011-12లో ప్రభుత్వం తొలి సారిగా కౌలు రైతులను ఆదుకునేందుకు కౌలు రుణ అర్హత చట్టాన్ని తీసుకువచ్చి, కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది. ఇవి ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. ఈ కార్డులతో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ సబ్సిడీ పొందవచ్చని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ప్రధానంగా బ్యాంకుల నుంచి  పంట రుణాలు పొందే వీలుంటుందని ప్రకటించింది. అయితే ఈ కార్డులను బ్యాంకర్లు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం.

గత ఏడాది 9,376 మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇవ్వగా అతి కష్టమీద 11 మందికి రూ.1.65 లక్షలు మాత్రమే అందించారు. రుణ అర్హత కార్డులు పొందిన ఆయా రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందనేలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ జాడ కరువైంది. యజమానులే సంబంధిత భూములపై అన్ని ప్రయోజనాలు పొందారు. ఇక మీకొచ్చేది ఏమి లేదంటూ బ్యాంకర్లు, అధికారులు తేల్చి చెప్పారు. చివరికి ఈ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కౌలు రైతులు నిర్ధారణకు వచ్చారు.
 
ఈ నేపథ్యంలో 2015-16లో కార్డుల కోసం రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. కడప డివిజన్‌లో 978 మంది కౌలు రైతులు దరఖాస్తు చేసుకోగా, 809 మంది అర్హత పొందారు. రాజంపేట డివిజన్‌లో 1450 మంది దరఖాస్తు చేసుకోగా 1402 మంది అర్హత పొందారు. జమ్మలమడుగు డివిజన్‌లో 2772 మంది దరఖాస్తు చేసుకోగా 2772 మంది అర్హత సాధించారు. ప్రభుత్వం పట్టించుకోక, బ్యాంకర్లు లెక్కచేయక, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చాలా మంది కౌలు రైతులు రుణ అర్హత కార్డులపై ఆశలు వదలుకున్నారు.
 
ఈ ఖరీఫ్‌లో రుణాలు అనుమానమే..

పంట రుణాలు అందరి రైతులతో పాటు కౌలు రైతులు పొందకపోతే వారు కార్డులు పొందినా ఏలాంటి ప్రయోజనం ఉండదు. అందునా ఆగస్టు నెలాఖరు వరకే పంట రుణాలు ఇచ్చేదని, అటు తరువాత రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు చెబుతున్నట్లు కౌలు రైతులు అంటున్నారు. ఈ తరుణంలో రుణ అర్హత కార్డులు పొందినా బ్యాంకర్లు మొండి చేయి చూపడంతో రుణాలు పొందలేమని నిట్టూరుస్తున్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేమని బ్యాంక ర్లు చేతులెత్తేయడంతో ఆయా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. దీనిపై అటు రెవిన్యూ అధికారులు, ఇటు బ్యాంకర్లు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement