హుందాతనం చాటుకున్న గోరంట్ల మాధవ్‌ | Government Officially Hosted Kanakadasa Jayanti Celebrations | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో వైఎస్‌ జగన్‌

Published Mon, Nov 18 2019 6:39 AM | Last Updated on Mon, Nov 18 2019 10:54 AM

Government Officially Hosted Kanakadasa Jayanti Celebrations - Sakshi

కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, కలెక్టర్‌ సత్యనారాయణ తదితరులు

సాక్షి, అనంతపురం: ఏడాది కిందట కురుబ సంఘం ఆధ్వర్యంలో జూనియర్‌ కళాశాల వేదికగా జరిగిన కనకదాస జయంతి వేడుకల్లో గోరంట్ల మాధవ్‌ రాకను అప్పటి టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి అక్షేపించారు. ఆ రోజుల్లో కదిరిలో సీఐగా గోరంట్ల మాధవ్‌ పనిచేసేవారు. తనకు ఆహ్వానం లేకపోయినా.. కులం మీద అభిమానంతో సభకు ఒక సాధారణ వ్యక్తిగా హాజరైన మాధవ్‌ పట్ల వేలాదిమంది కురుబలు అభిమానం వ్యక్తం చేస్తూ భుజాలపై ఎత్తుకుని సభావేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి.. సభావేదికపై నుంచే మాధవ్‌పై తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు.

కనకదాస జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న మంత్రి శంకరనారాయణ  

దీంతో కాస్త గందరగోళం నెలకొని ముఖ్యఅతిథిగా విచ్చేసిన కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఆ తర్వాత మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం.. వైఎస్సార్‌ సీపీ తరుఫున హిందూపురం ఎంపీగా పోటీ చేసి తిరుగులేని విజయాన్ని అందుకోవడం విదితమే. ఆదివారం అదే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వేదికగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కనకదాస జయంతి వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథిని ఎంపీ మాధవ్‌ స్వయంగా వెళ్లి ఆహ్వానించి, తన హుందాతనాన్ని చాటుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల కార్యక్రమానికి తాను హాజరు కాలేకపోతున్నట్లు పార్థసారథి పేర్కొన్నారంటూ మాధవ్‌ సభావేదికపై నుంచి ప్రకటించారు.   

సమావేశానికి హాజరైన కురుబలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుస్తూ.. రాష్ట్రంలో వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారంటూ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ కొనియాడారు. కనకదాస రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనంతపురంలో ఆదివారం నిర్వహించింది. ముందుగా గుత్తి రోడ్డులోని కనకదాస విగ్రహానికి మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, కలెక్టర్‌ సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి వెండి రథంలో కనకదాస చిత్రపటాన్ని ఉంచి జూనియర్‌ కళాశాల వరకూ శోభాయాత్రగా తీసుకొచ్చారు.  

చదువు ఒక్కటే మార్గం 
జూనియర్‌ కళాశాలలో అధికారికంగా నిర్వహించిన కనకదాసు జయంతి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కురబలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శంకరనారాయణ మాట్లాడారు. కవిత్వం, సాహిత్యంతో సమాజాన్ని మేల్కోల్పిన గొప్ప మహనీయుడు భక్త కనకదాసని అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. ఇతర కులాలతో పోటీ పడాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. ప్రతి కుటుంబంలోనూ పిల్లలను బాగా చదివించాలని కోరారు.
 
ఓటు బ్యాంక్‌గా చూశారు 
కనకదాస జయంతిని అధికారికంగా చేపట్టాలని 15 ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలు పట్టించుకోలేదని శంకరనారాయణ గుర్తు చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే టీడీపీ చూస్తూ వచ్చిందని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వచ్చారన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 50 శాతానికి పైగా బలహీన వర్గాల వారికే అవకాశం కల్పించడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ రామారావు, కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు వశికేరి లింగమూర్తి, రిటైర్డ్‌ జడ్జి కిష్టప్ప, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, రాజహంస శ్రీనివాసులు, బోరంపల్లి ఆంజనేయులు, నెమలివరం ఈశ్వరయ్య, లలిత కళ్యాణి, బిల్లే మంజునాథ్, కేవీ మారుతీప్రకాష్‌, బ్యాళ్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement