
అక్రమ జీవోలను నిలిపేయాలి
ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమ జీవోలను నిలువరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌కు విన్నవించింది.
విభజన చట్టం సెక్షన్ 95ను రక్షించాలి
గవర్నర్ నరసింహన్‌కు ఏపీ ప్రభుత్వ విన్నపం
ఎన్జీరంగా వర్సిటీ పేరు మార్చడంపై నిరసన
విభజన చట్టం 9, 10 షెడ్యూల్‌లో లేని సంస్థలు న్యాయంగా ఏపీకే దక్కాల్సి ఉందని వ్యాఖ్య
హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95కు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమ జీవోలను నిలువరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌కు విన్నవించింది. విభజన చట్టంలోని 9, 10వ షెడ్యూల్‌లో చేర్చని సంస్థలు మాతృరాష్ట్రానికి చెందాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా ఆయా సంస్థలను తనవిగా చేసుకుంటూ పేర్లు మార్చుకోవడం దారుణమని పేర్కొంది. ప్రతిష్టాత్మక ఎన్జీరంగా యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీగా పేరు మార్చడంపై నిరసన వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, రాష్ట్రప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌లు బుధవారం గవర్నర్‌ను కలసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయ వర్సిటీకి జయశంకర్, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహరావు పేర్లు పెడుతూ తెలంగాణ ప్రభుత్వమిచ్చిన జీవో 7, జీవో 1లు న్యాయసమ్మతం కాదన్నారు. చట్టానికి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం జీవోలివ్వకుండా తాను నచ్చచెబుతానని, ఈ విషయంలో సానుకూల ఫలితాలుంటాయని తాను నమ్ముతున్నానని గవర్నర్ వ్యాఖ్యానించారని వారు తెలిపారు. మంత్రులు మంగళవారమే గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని భావించారు. కానీ అపాయింట్‌మెంట్ లేకపోవడంతో బుధవారం భేటీ అయ్యారు. అప్పటికే వర్సిటీ పేరు మార్పు జీవో ఆమోదం పొందడం, యూని వర్సిటీ పేరు మార్పు, జయశంకర్ విగ్రహావిష్కరణ కూడా జరగడం విశేషం.