కంప్యూటర్ విద్య మూత‘బడి’నట్లే!
ప్రభుత్వ పాఠశాలలో ఇన్‌స్ట్రక్టర్ల తొలగింపు!
నిధులు వెచ్చించలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం
కంప్యూటర్ పరిజ్ఞానం లేని టీచర్లే ఇక బోధించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అందిస్తున్న కంప్యూటర్ విద్య పథకానికి సంబంధించి ఐదేళ్ల కాలం పూర్తి కావడంతో దాని నిర్వహ ణ బాధ్యత ఇప్పుడు పూర్తిగా రాష్ట్రప్రభుత్వంపై పడింది. ఈ పథకానికి ఇన్నాళ్లు 25 శాతం నిధులు మాత్రమే వెచ్చించిన రాష్ట్రం ఇకపై 100 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. అయితే నిధులు వెచ్చించలేక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేస్తుంది.కంప్యూటర్లు, జనరేటర్ల నిర్వహణ, దాదాపు 12 వేల మంది ఇన్‌స్ట్రక్టర్లకు ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాల మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా లేమని చెబుతోంది. దీంతో రాష్ట్రంలోని ఐదువేల ఉన్నత పాఠశాలల్లో ఇన్నాళ్లు పనిచేసిన కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. పైగా నిర్వహణ సంస్థల నుంచి కంప్యూటర్లు, జనరేటర్లు అన్నింటిని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వాధీనం చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల డీఈవోలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఆయా స్కూళ్లలోని టీచర్లకు కంప్యూటర్ విద్య బోధనపై అవగాహన లేదు. పెద్దగా శిక్షణ పొందిన దాఖలాలు లేవు. దీంతో ఆ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను బోధించే వారు లేకపోవడంతో విద్యార్థులకు కంప్యూటర్ విద్య దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కేంద్రం 75 శాతం నిధులను అందించి 2008-09 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ విద్య పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
రాష్ట్రం 25 శాతం నిధులను వెచ్చించి 7 కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఇన్నాళ్లు పథకాన్ని నిర్వహించింది. ప్రస్తుతం ప్రాజెక్టు ఐదేళ్ల కాలం ఈ నెలతో పూర్తయింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థల ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీంతో ఆ సంస్థలు కంప్యూటర్ విద్యను నిలిపివేశాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న 12 వేల మంది ఇన్‌స్ట్రక్టర్లు ఇప్పుడు ఉద్యోగాలు వదుకోవాల్సివస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిధులను వెచ్చించేందుకు సిద్ధంగా లేకపోవడంతో కంప్యూటర్ విద్య బోధనను స్కూళ్లలోని టీచర్లే నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కంప్యూటర్ నిర్వహణ సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏటా ఆయా స్కూళ్లలోని ఐదుగురు టీచర్లకు కంప్యూటర్ విద్యా బోధనపై ఆయా సంస్థలు శిక్షణ ఇవ్వాలి. కాని టీచర్లు దానిని నేర్చుకున్న దాఖలాలు పెద్దగా లేవు. దీంతో బోధన ఎలా అనే అంశంపై ఉన్నతాధికారులే తల పట్టుకుంటున్నారు. కనీసం ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకైనా రాష్ట్ర నిధులను వెచ్చించి ఇన్‌స్ట్రక్టర్లను కొనసాగిస్తే ఉపయోగం ఉంటుందని పేర్కొంటున్నారు.