ప్రభుత్వ విద్య పేదలకు అందని ద్రాక్షలా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
నెల్లూరు(సెంట్రల్) : ప్రభుత్వ విద్య పేదలకు అందని ద్రాక్షలా మారే పరిస్థితులు నెలకొన్నాయి. బడుగుబలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకునే సంక్షేమ వసతి గృహాలను మూసివేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 హాస్టల్స్ మూసివేత దిశలో ఉన్నాయి. అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నందిస్తానని ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు.
ఇంట్లో కనీసం తిండి తినేందుకు కూడా అవకాశం లేని విద్యార్థులను తల్లిదండ్రులు వసతిగృహాల్లో చేర్పించి చదివించుకుంటున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ తమ బిడ్డలు చదువుకుంటున్నారనే ఆశల్లో తల్లిదండ్రులున్నారు. వారి ఆశలపై చంద్రబాబు ప్రభుత్వం నీళ్లు చల్లనుంది. వివిధ సాకులు చూపి ఉన్న వాటిని మార్చి ఒకే చోటికి చేర్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో పేద విద్యార్థులకు దాదాపుగా విద్య దూరం కానుందనే చెప్పాలి.
50 మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న వసతిగృహాలను మూసి వేసి వేరే చోటకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో బీసీ వసతి గృహాలు 86 , ఎస్సీ వసతి గృహాలు 142, ఎస్టీ హాస్టల్స్ 23 ఉన్నాయి. ఎస్సీ వసతిగృహాల్లో దాదాపుగా 30 వసతిగృహాలను, 14 ఎస్టీ హాస్టళ్లు, 10 వరకు బీసీ వసతిగృహాలను తీసివేసి వేరే చోటకు మార్చడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెల 21న ఉన్నతాధికారులతో జరిగే సమావేశంలో ఏయే ప్రాంతాల్లో వసతిగృహాలను తొలగించాలో పేర్లు వెల్లడించనున్నారు.
హాస్టల్స్ మార్పిడి వల్ల విద్యార్థులు అవస్థలెదుర్కొంటారు. వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెబుతున్నారు. జిల్లాలో గూడూరు, నాయుడుపేట డివిజన్‌లలో ఎక్కువగా రెసిడెన్సియల్ పాఠశాలలున్నాయి. ఉదయగిరి, సీతారామపురం ,కావలి, నెల్లూరు పరిదిలోని వసతిగృహాలను సైతం గూడూరు, నాయుడుపేట వద్ద ఉన్న రెసెడెన్సియల్ పాఠశాలలో కలిపే విధంగా సన్నాహాలు చేసినట్లు సమాచారం.
ఈ విధానంతో దాదాపుగా ఆత్మకూరు,ఉదయగిరి, కావలి ప్రాంతాలలో ఉన్న వసతిగృహాల్లో చదివే విద్యార్థులకు దాదాపుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరు, నాయుడుపేట వద్దకు విద్యార్థులు రావాల్సి ఉంటుందని పలువురు అధికారులే అంటున్నారు. ఈ నిర్ణయం విద్యార్థులకు శాపంలాగా మారిందని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 50 వసతిగృహాలను మూసి వేస్తే వాటిలో పని చేసే వార్డెన్లు, ఆయాలు, వాచ్‌మెన్‌లు పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పేద విద్యార్థులకు ఎంతో ఆసరాగా ఉన్న హాస్టళ్లను తొలగించే ఆలోచనలు మానుకోవాలని పలువురు కోరుతున్నారు.