నిప్పోసెంటర్ మద్యం దుకాణం వద్ద స్థానికులతో మాట్లాడుతున్న నెల్లూరు ఒన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రత్నం
నెల్లూరు(క్రైమ్): సంపూర్ణ మధ్య నిషేధించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చల విడిగా విక్రయాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. పలు ఆంక్షలతో విక్రయాలు జరిగాయి. నూతన మద్యంపాలసీ మంగళవారం అమలులోకి వచ్చింది. నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 280 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా నాలుగుచోట్ల మినహా మిగిలిన చోట్ల దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు మద్యం విక్రయాలు సాగాయి. ప్రతి దుకాణం వద్ద వివరాలు, విక్రయవేళలు, ఎంఆర్‌పీ ధరలతో పాటు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ముద్రించిన ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేశారు.
పడిగాపులు కాసిన మందుబాబులు...
గతంలో ఉదయం 10గంటలకే మద్యందుకాణాలు ప్రారంభమయ్యేవి. దీంతో మందుబాబులు పదిగంటల నుంచి మద్యసేవనంలో మునిగితేలేవారు. అయితే తాజాగా మారిన వేళల ప్రకారం ఉదయం 11గంటల నుంచి మద్యం దుకాణాలు తెరవడం, మందుబాబులు దుకాణాల వద్ద మద్యంకోసం పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటలకు దుకాణాలు మూసివేస్తుండడంతో రాత్రి 7గంటల నుంచి క్యూకట్టారు. దీంతో దుకాణాలవద్ద కంట్రోల్‌చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది.
ప్రారంభం కాని నాలుగు దుకాణాలు...
నెల్లూరు నగరంలోని నిప్పోసెంటర్, బుజబుజనెల్లూరు, ఆత్మకూరు, ఉదయగిరి పట్టణాల్లో నాలుగుదుకాణాలు ప్రారంభం కాలేదు. పలు ప్రభుత్వ మద్యం దుకాణాలను నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ వి. రాధయ్య, నెల్లూరు, గూడూరు ఈఎస్‌లు కె. శ్రీనివాసాచారి, వెంకటరామిరెడ్డి తదితరులు పరిశీలించారు. ఆయా ప్రాంత సిఐలు షాపుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సిబ్బందికి పలు సూచనలు, సలహాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment