
సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాస రావు
నూనెపల్లె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఎం 20వ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మున్సిపల్ టౌన్‌హాల్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడతూ.. ప్రధాని మోడీ విదేశీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలకు ఆహ్వానించాలని చూడడం సరికాదన్నారు. ఎఫ్‌డీఐలతో దేశంతో 40వేల మంది చిల్లర వ్యాపారులు రోడ్డున పడతారన్నారు.
విదేశాల సొమ్ముకు సీఎం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడుతున్నారని, ఇందుకు దావోస్‌లో జరిగిన దేశాల ఆర్థిక సమావేశానికి వెళ్లడమే ఉదాహరణగా చెప్పారు. వాల్‌మార్ట్ సంస్థకు వ్యాపారాలు చేయాలని బాబు చెబుతున్నారని, దీంతో చిన్న సన్నకారు రైతులు పంటలు సాగు మానుకోవాల్సిందేనన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ..రాష్ట్ర విభజనకు బీజేపీ, టీడీపీ మద్దతిచ్చాయన్నారు. విభజన రాష్ట్రాలకు అప్పట్లో ప్యాకేజీలు ఇస్తామని నాయకులు చెప్పిన మాటలు మరిచారన్నారు.
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ డిమాండ్ చేశారు. సీమ సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రామాంజనేయులు, రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శంకరయ్య, మస్తాన్‌వలి, మద్దులు తదితరులు పాల్గొన్నారు.