
రాష్ట్రపతికి గవర్నర్ నివేదిక
- ఇరు రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రణబ్‌కు నివేదన
- రేవంత్ ఎపిసోడ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఆడియో వ్యవహారం..
- ఇద్దరు సీఎంల పరస్పర విమర్శలపై సమగ్ర నివేదిక
- హోంమంత్రి రాజ్‌నాథ్‌తోనూ సమావేశం
- నా పర్యటన సాధారణమైందే.. సంచలనమేదీ లేదు: నరసింహన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాల పనితీరు, శాంతిభద్రతలు, ఓటుకు నోటు అంశంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి చిక్కడం, సీఎం చంద్రబాబు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య ఫోను సంభాషణల ఆడియో టేపు వ్యవహారం, ఇరు రాష్ట్రాల సీఎంల పరస్పర విమర్శలకు సంబంధించి అంశాలవారీగా సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందజేసినట్టు సమాచారం.
మరోవైపు బుధవారం సాయంత్రం నరసింహన్ నార్త్‌బ్లాక్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇరురాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. అంతకుముందు బుధవారం ఉదయమే గవర్నర్.. జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఆర్.ఎన్.రవిని కలిశారు. అంతర్గత, విదేశాంగ భద్రతకు సంబంధించిన బాధ్యతలు నిర్వహించే జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ నేరుగా పీఎంవో ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఓటుకు నోటు అంశంతో ఇరు రాష్ట్రప్రభుత్వాల మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, తాజా పరిణామాలపై నివేదికను అందచేసినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా గవర్నర్.. హోంమంత్రిని కలసిన కొద్దిసేపటికే ఏపీ సీఎం చంద్రబాబు రాజ్‌నాథ్‌ను కలవడానికి వస్తున్నట్టు తెలిసింది. దీంతో నరసింహన్ బయటికొచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్, చంద్రబాబు ఎదురుపడ్డారు. వెంటనే గవర్నర్ ఫొటోగ్రాఫర్‌ను పిలిపించి బాబుతో కలసి ఫొటో తీయించుకున్నారు. రాజ్‌నాథ్‌తో చంద్రబాబు భేటీ సమయంలో గవర్నర్ హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో సమావేశమయ్యారు.
చంద్రబాబు వెళ్లిపోయాక గవర్నర్ మరోసారి రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. మరోవైపు హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు.
అన్నీ సర్దుకుంటాయి
రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటన సాధారణమైనదేనని, ఇందులో సంచలనమేమీ లేదని చెప్పారు. ఇరురాష్ట్రాల మధ్య పరిస్థితులన్నీ సర్దుకుంటాయని ఆశాభావం వెలిబుచ్చారు. విభజన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతుందనేది కేంద్రానికి వివరించడానికి వచ్చానన్నారు.
సెక్షన్ 8పై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్రం తెలుసుకునే అవకాశంపై ప్రశ్నించగా.. ‘‘సమావేశంలో ఇలాంటివేమీ చర్చకు రాలేదు’’ అని చెప్పారు. గవర్నర్ అధికారాలపై అడగ్గా.. ‘నో కామెంట్’ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను కేబినెట్‌లోకి ఎలా తీసుకుంటారని టీడీపీ ప్రశ్నించడంపై.. ఆయన ‘నో కామెంట్’ అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌పై తానెలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల పరస్పర విమర్శలపై ‘నో కామెంట్’ అన్నారు. కాగా గవర్నర్ గురువారం ప్రధానితో భేటీ కానున్నారు.