
సాక్షి, అనంతపురం : పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు బరితెగించారు. పట్టపగలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. ప్రభుత్వ డాక్టర్ ఆనంద్ బాబు, మరో నలుగురు సిబ్బంది వైద్య సేవలు పక్కనపెట్టి.. రోగులను గాలికొదిలేసి.. ఆస్పత్రిలోనే పేకాట ఆడుతూ, మద్యం సేవిస్తూ జల్సా చేశారు. దీంతో ఆస్పత్రిలో ఎటుచూసినా మద్యం బాటిళ్లు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి.
వైద్యుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోగుల అవస్థలను పట్టించుకోకుండా ఆస్పత్రిలోనే అసాంఘిక కార్యకలాపాలకు దిగడం దారుణమని, ఇది ఆస్పత్రా.. మద్యం దుకాణామా? అని నిలదీశాయి. ఆస్పత్రిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.