సాదరంగా ఆహ్వానం | Grand welcome for Jagan Mohan Reddy at Kolkata | Sakshi
Sakshi News home page

సాదరంగా ఆహ్వానం

Published Thu, Nov 21 2013 2:15 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోల్‌కతా చేరుకున్నపుడు ఘనస్వాగతం లభించింది.

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోల్‌కతా చేరుకున్నపుడు ఘనస్వాగతం లభించింది. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన జగన్ బృందం మధ్యాహ్నం 12.40 గంటలకు కోల్‌కతాకు చేరుకుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు (క్విజ్ మాస్టర్ కూడా) డెరెక్ ఓబ్రియెన్ వారికి స్వాగతం పలికారు. జగన్ రాకను తెలుసుకుని కోల్‌కతాలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద గుమిగూడి ‘జై జగన్...’ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతించారు. వారిని చూసి జగన్ ఇంత మంది తెలుగువారు ఇక్కడ ఉన్నారే అని వ్యాఖ్యానించారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.
 
 నేరుగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర సచివాలయానికి 1.30 గంటలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో మమత , జగన్‌కు ఎదురేగి ఆత్మీయంగా పలకరించి లోనికి ఆహ్వానించారు. అమ్మ ఎలా ఉంది? అని మమత పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గురించి కుశల ప్రశ్నలు వేశారు. తనకు తొలి నుంచీ వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని ఆమె ఈ సందర్భంగా అన్నారు. జగన్ తనకు తమ్ముడులాంటి వాడని, ఆయనతోనే తానుంటానని (ఐ యామ్ విత్ జగన్) మమత ఆ తరువాత విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. తొలుత జగన్, మమత ఇద్దరూ ఏకాంతంగా సుమారు పదిహేను నిమిషాలు దేశ రాజకీయాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తరువాత నలభై నిమిషాల సేపు అందరూ కలిసి చర్చలు జరిపారు. చర్చలు ముగిశాక మమత స్వయంగా జగన్‌కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేశాక తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు డెరెక్‌ను విమానాశ్రయం వరకూ వెళ్లి వీడ్కోలు పలికి రావాల్సిందిగా ఆమె కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement