వడ్రపాలెం టు సింగ్‌పూర్..
- నాడు సారా అమ్మకాలకు నిలయం
- నేడు విద్యావంతులు, ఉద్యోగుల మయం
- మద్యం అమ్మకాలు నిషేధం
- ఉపాధి కోసం విదేశాలకు...
- ఆదర్శంగా నిలిచిన వడ్రపాలెం గ్రామస్తులు
దేవరాపల్లి: మండలంలోని ఎన్‌జీనగరం పంచాయతీ శివారు వడ్రపాలెం గ్రామంలో సుమారు పదేళ్ల క్రితం వరకు సారా అమ్మకాలకు నిలయంగా ఉండేది. నిత్యం గ్రామంలో సారా ఏరులై పారేది. నిత్యం మద్యం బాబుల ఆగడాలతో తగాదాలు, అల్లర్లు చోటు చేసుకొనేవి. మహిళలు నరక యాతన పడేవారు. అయితే 2006 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున జాతిపిత సాక్షిగా మద్యం, సారా అమ్మకాలను గ్రామంలో నియంత్రించాలని మహిళలు పూనుకున్నారు.
వీరికి గ్రామ పెద్దలు అండగా నిలవడంతో అంతా కలిసి మద్యం మహమ్మారిని గ్రామం నుండి పారదోలాలని నిర్ణయించుకున్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మహిళలకు క్రమేపి మగవారంతా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం వడ్రపాలెంతో పాటు ఎన్‌జీ నగరం కూడా మద్య రహిత గ్రామంగా మండలంలో గుర్తింపు సంపాదించుకుంది. వడ్రపాలెంలో సుమారు 60 ఇళ్లు ఉన్నాయి. 250 మందికి పైగా జనాభా ఉన్నారు.
30 మందికి పైగా సింగ్‌పూర్‌లో..
గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో వెల్డర్, ఫిట్టర్, షిప్ మరమ్మతులు తదితర పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరు సింగ్‌పూర్, అబుదబీ, దుబాయ్, సౌత్‌ఆఫ్రికా, మాల్ దీవులు, బెహరాన్ తదితర దేశాలలో ఉపాధి కోసం వెళ్లారు. రెండేళ్లకోసారి వస్తుంటారు. బోని శ్రీను, బోని సత్యరావు, కుంది సత్యారావు, పైడి రాజు, గాడి అప్పల సత్యారావు,బోని సతీస్, ఖండేపల్లి రాజు, తదితరులు సింగ్‌పూర్‌లో ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. మరి కొందరు బెహరాన్, అబుదబీలో ఉంటూ ఉపాధి పొందుతున్నారు.
ఉన్నత విద్యావంతులుగా..
ఒకప్పుడు సారాకు అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ప్రస్తుతం పలువురు విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుంది హారిక ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినా మేనత్త సహకారంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. బురిడి శంకరరావు పీహెచ్‌డీ పూర్తి చేసి నన్నయ్య యూనివర్సిటిలో ప్రొపెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సబ్బవపు శ్రీను పీహెచ్‌డీ, కుంది లోకేష్, కుంది శేఖర్‌లు పీజీలు చేస్తున్నారు. కార్లె త్రినాధ్ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు.
ఇక్కడ ఉపాధి లేక..
గ్రామంలో ఉపాధి లేక పోవడంతో ఎనిమిదే ళ్లుగా విదేశాలకు వెళ్తున్నాను. 10వ తరగతి చదివిన తాను వెల్డింగ్‌లో శిక్షణ పొందాను. ఇప్పటి వరకు సింగ్‌పూర్, అబుదబీ, సౌత్ అరేబియా వెళ్లాను. అక్కడ నెలకు రూ. 20 వేల నుంచి 30 వేల ఆదాయం వస్తుంది.
-ఖండేపల్లి జగన్నాధరావు, వడ్రపాలెం
సింగ్‌పూర్‌లో వెల్డర్‌గా..
పదేళ్లుగా సింగ్‌పూర్‌లో వెల్డర్‌గా పని చేస్తున్నాను. రెండేళ్ల కోసారి గ్రామానికి వస్తుంటాను. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటున్నారు.
-గాడి అప్పల సత్యారావు, వడ్రపాలెం