శంషాబాద్ డీసీపీ పి.వి.పద్మజ
మహిళలు లింగ వివక్ష, వేధింపుల నుంచి బయటపడి సాధికారత వైపు అడుగులు వేయాలంటే వారు చదువుకోవాలని, విద్యతోనే మహిళల జీవితాల్లో మార్పురాగలదని శంషాబాద్ డీసీపీ పి.వి.పద్మజ అన్నారు. అయితే, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అవగతం చేసుకునే విధంగా ఉండాలన్నారు. మహిళల సాధికారతపై పద్మజ ‘సాక్షి’తో మాట్లాడారు. డీసీపీ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే..
సాక్షి, శంషాబాద్: మాది కర్నూలు జిల్లా కోవెల కుంట్ల గ్రామం. మా నాన్న రిటైర్డ్ ఎస్పీ వాసుదేవరెడ్డి. బాల్యమంతా చిత్తూరు జిల్లాలోనే గడిపాను. మదనపల్లిలోని రిషివ్యాలీ, చిత్తూరులోని మహర్షి విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తి చేశాను. బీఎస్సీ అగ్రికల్చర్ కర్నూలులోని మహానంది వద్ద చదువుకున్నా. డిగ్రీ రెండో సంవత్సరంలోనే నా వివాహమైంది. ఆ తర్వాత ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. సివిల్ సర్విస్ ఉద్యోగం చేయాలని చిన్న నాటి నుంచే నా మనస్సులో నాటుకుంది.
2004లో సివిల్ సర్విస్ తొలిసారి రాయగా.. ఐఎఫ్‌ఎస్ వచ్చింది. కొన్ని కారణాల వల్ల దానిని వదులుకున్నాను. పెళ్‌లైన ఏడేళ్ల తర్వాత 2007లో గ్రూప్ వన్ పరీక్షలు రాసి తొలిప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. గ్రూప్ వన్ ఉద్యోగిగా శిక్షణకు సంబంధించిన పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా హోం మినిస్టర్ ట్రోఫీ అందుకోవడం గొప్ప అనుభూతి. శిక్షణ అనంతరం మల్కాజ్‌గిరి ఏసీపీగా తొలి పోస్టింగ్ వచ్చింది.
అది నా జీవితంలో ఎంతో కీకలమైంది. ఆ తర్వాత నిజామాబాద్ అదనపు ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం శంషాబాద్ డీసీపీగా పట్టణ గ్రామీణ వాతావరణ కలియికలో ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా పనిచేసే అవకాశం వచ్చింది. పోలీసు శాఖ నిరంతరం సవాళ్లతో కూడుకున్న రంగం కావడంతో ఎప్పుడు అంతా కొత్తగానే ఉంటుంది. ఇందులోను వివిధ విభాగాల్లో సమాజానికి సేవలందించే అవకాశం విస్తృతంగా ఉంటుంది.
పెళ్లి వయసు మారాలి
అమ్మాయిలున్న తల్లిదండ్రులు వారికి పద్దెనిమిదేళ్ల వయస్సు రాగానే పెళ్లి చేసెయ్యాలనుకుంటారు. వివాహంపై పూర్తిస్థాయి అవగాహన లేకుండా పెళ్లిళ్లు చేయడంతో ఆడపిల్లలు అనేక సమస్యల్లో చిక్కుకుపోతున్నారు. డిగ్రీ పూర్తిచేయాలన్నా కనీసం 20 ఏళ్లు పడుతుంది. అదే పెళ్లికి మాత్రం 18 ఏళ్లు నిర్ధారించడం ఎంతవరకు భావ్యం. కనీసం డిగ్రీ ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా ఓ ఉద్యోగం సాధ్యమవుతుంది. అందుకే పెళ్లికి ఉన్న కనీస వయస్సుల్లో కూడా మార్పులు చేయాలి. తల్లిదండ్రులు అమ్మాయి భారం అన్న దృక్పథాన్ని మార్చుకోవాలి.
మనలోని ఆ భావన వీడాలి..
కొన్ని పనులు కేవలం పురుషలకే సాధ్యం అన్న భావనను ముందు మహిళలు వీడాలి. అమ్మాయిలు అనుకుంటే సాధించనది ఏదీ ఉండదు. సాంకేతి పరిజ్ఞానంతో పాటు అన్ని రంగాలు, ఉద్యోగాల్లో మహిళలు ఉన్నతంగా రాణిస్తున్నారు. క్రీడల్లో సైతం ఒలిపింక్ పతకాలను సాధించి దేశం గర్వించేలా చేస్తున్నారు. ఎందులోనూ మహిళలు తమను తామకు తక్కువగా అంచనా వేసుకోవద్దు. విజయాలను సాధించిన వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేయాలి.
కౌన్సెలింగ్ ఇస్తున్నాం..
మహిళల, బాలికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు షీ టీంల దృష్టికి వస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. కొందరు మహిళలు ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానంగా అహం, అనుమానం అన్నవి దంపతుల మధ్య కనిపిస్తున్నాయి. తమకు తాముగా పరిష్కరించుకునే సమస్యలను కూడా తీవ్రంగా మార్చుకుంటూ సమస్యల ఊబిలో చిక్కిపోతున్నారు. చాలా మందికి కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నాం
వేధింపులు పెరిగాయి
సమాజంలో లైంగిక వేధింపులు పెరిగాయి. కుటుంబ సభ్యులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మైనార్టీ వయస్సులో ఉన్న పిల్లల పట్ల కూడా అమానుషకరమైన సంఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ చైతన్యం కావల్సిన అవసరం ఉంది.
విద్యతోనే వివక్ష దూరం..
సమాజంలో లింగ వివక్ష ఆది నుంచి బలంగానే ఉందనేది వాస్తవం. అయితే, మారుతున్న పరిస్థితుల్లో ఏ మతం, కులంలోనైనా చదువుకున్న నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఇది క్రమేణా తగ్గుముఖం పడుతుంది. విద్య లేని చోట ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ వివిక్ష రూపుమాపడానికి పుస్తకాల విద్యనే కాకుండా సమాజాన్ని కూడా అన్ని కోణాల్లో చదవాలి. అప్పుడే దీనిని పూర్తిస్థాయిలో రూపు మాపవచ్చు. కొన్ని చోట్ల పేదరికం కూడా ఈ వివక్షకు కారణమవుతోంది. కాలేజీకి పంపుతున్నారు కదా అన్న ధోరణిలో అమ్మాయిలు కూడా కాలక్షేపం కోసం చదివితే మాత్రం జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వారే కారణంగా మారుతారు.
Comments
Please login to add a commentAdd a comment