స్టేషన్ ఎదుట సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : అసలే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం... అక్కడ పోలీస్ డ్యూటీ అంటే కత్తిమీద సాము లాంటిదే.. అలాంటి ప్రాంతంలో మహిళా పోలీసులు డ్యూటీ చేయడం అంటే అసాధ్యం అంటారు.
కానీ వనదేవతలు కొలువైన ములుగు జిల్లాలో మహిళా రక్షకభటులే ఆ ప్రాంతానికి రక్షణ కవచంలా మారారు. మారుమూల అటవీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ఆడది అబల కాదు... కనిపించని ‘నాలుగో సింహమేరా పోలీస్’ అని నిరూపిస్తున్నారు. అన్నల ఇలాఖా ఆడ పోలీసులకు అడ్డాగా మారింది.
పురుషులతో సమానంగా... సెంట్రీ నుంచి ఎస్‌హెచ్‌ఓ వరకు
తెలంగాణలో అధికశాతం అటవీప్రాంతం గల జిల్లా ములుగు. అడవే కాదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన జిల్లాలో పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అలాంటి ప్రదేశంలో పోలీస్ డ్యూటీ అంటే మగవారికే ముచ్చెమటలు పడుతాయి.
కానీ మహిళా పోలీసులు నిర్భయంగా పని చేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు కానిస్టేబుల్ నుంచి ఎస్సై స్థాయి వరకు 150 మంది మగవారితో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా రిసెప్షనిస్ట్, హెల్ప్‌డెస్క్ లో మహిళా పోలీసులు ఉండడం సహజం.
కానీ వెంకటాపూర్‌లో 28 మంది పోలీస్ సిబ్బంది ఉంటే అందులో 22 మంది మహిళలే ఉన్నారు. జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్‌లేకపోయినా, వెంకటాపూర్ పీఎస్‌ను చూస్తే మహిళా పోలీస్ స్టేషన్ అనక తప్పదు. సెంట్రీ డ్యూటీ నుంచి ఇన్‌చార్జ్ ఎస్‌హెచ్‌ఓ డ్యూటీ వరకు మహిళా రక్షకభటులే నిర్వహిస్తారు.
ప్రస్తుతం అందులో సగం మంది ఎస్సై పోస్ట్ కొట్టేందుకు కోచింగ్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అక్కడికి చేరి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజాసేవలో ముందుంటున్నారు.
సరిహద్దు ఠాణాల్లో మన మహిళా శివంగులు
బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ (బీపీఆర్‌డీ) గణాంకాల ప్రకారం 2021 జనవరి 1 నాటికి 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుంటే.. మహిళా పోలీసుల సంఖ్యలో తెలంగాణది 25వ స్థానం.
ఈ విషయంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణలో ఉన్న వారు అందులో సగం కంటే తక్కువ. రాష్ట్రంలో మొత్తం పోలీసుల సంఖ్యలో 8.03 శాతం మాత్రమే మహిళలు.
వీరిలో 76.5 శాతం క్షేత్రస్థాయిలోని కానిస్టేబుళ్లే. అదనపు డీజీపీలు అయిదుగురు, ఐజీలు ఇద్దరు, డీఐజీ ఒకరు, ఎస్పీలు 15 మంది, అదనపు ఎస్పీలు 19 మంది, డీఎస్పీలు నలుగురు, ఇన్‌స్పెక్టర్లు 58 మంది, ఎస్సైలు 514 మంది, ఏఎస్సైలు 214 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 280 మంది, కానిస్టేబుళ్లు 3,630 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లో అన్ని కేడర్‌లలో 8 వేలకు పైగా ఉండగా.. అందులో మహిళలు వెయ్యి మందికిపైగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లోని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పని చేస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment