విద్యతోనే మహిళా సాధికారత
విద్యతోనే మహిళా సాధికారత
Published Thu, Dec 29 2016 11:12 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
– జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
– భారీగా రన్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినీలు
కర్నూలు(అర్బన్): విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. జనవరి 3న జరగనున్న సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాల నేపథ్యంలో బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం 'రన్ ఫర్ ఉమెన్ వెల్ఫేర్ ' కార్యక్రమం జరిగింది. స్థానిక బిర్లాగేట్ పూలే విగ్రహం ఎదుట ముందుగా కలెక్టర్ విజయమోహన్ సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన అనంతరం జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు విద్య అందనంత దూరంలో ఉన్న కాలంలోనే సావిత్రీబాయి మహిళల విద్య కోసం ఎంతో కృషి చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని గుర్తు చేశారు. ఆమె చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జే లక్ష్మినరసింహ మాట్లాడుతూ బాలికలను విద్యావంతులను చేసేందుకు 1948లోనే సావిత్రీబాయి పూలే ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా రాష్ట్రంలో బాలికలకు ప్రత్యేకంగా హాస్టళ్లు ఉన్నా, సొంత భవనాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. మహిళా రక్షణ చట్టాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు రోజుకు మహిళలపై దాడులు అధికమయ్యాయని, చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. మహిళలకు ప్రత్యేక బ్యాక్‌లాగ్ ద్వారా ఉపాధి కల్పించాలని, సావిత్రీబాయి పూలేని మహిళలు ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో బీసీ జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.శేషఫణి, మహిళా సంఘం అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, రవీంద్ర విద్యా సంస్థల ఆధినేత పుల్లయ్య, ప్రిన్సిపాల్ రామకృష్ణ, విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భరత్‌కుమార్, ముక్తార్‌బాషా, హెచ్‌డబ్ల్యూఓలు హారతీదేవి, మేరీ పాల్గొన్నారు. 2కే రన్ బిర్లాగేట్ నుంచి కలెక్టరేట్ వరకు సాగింది.
Advertisement