మెదక్ చర్చి నిర్మాణ కూలీకి సన్మానం
రామాయంపేట, న్యూస్‌లైన్:
ఆసియా ఖండంలోనే ప్రసిద్దమైన మెదక్ చర్చి నిర్మాణం 1914 నుండి 1924 వరకు సీడబ్ల్యూ పాస్నెట్ ఆధ్వర్యంలో జరిగింది. చర్చిని ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించారు. అయితే చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్న 110 ఏళ్ల వృద్ధురాలు రామాయంపేట మండలం తొనిగ ండ్ల గ్రామానికి చెందిన ఆటిగారి లక్ష్మమ్మను క్రిస్మస్‌ను పురస్కరించుకుని బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ మాట్లాడుతూ మూడు సంవత్సరాలపాటు చర్చి నిర్మించేందుకు కూలీగా వెళ్లినట్లు తెలిపారు. రామాయంపేట గ్రామ పంచాయితీ 6వ వార్డు సభ్యుడు చంద్ర ప్రతాప్(చిన్న) తొనిగండ్ల గ్రామానికి చేరుకొని లక్ష్మమ్మకు శాలువా కప్పి, పూల మాల వేసి, చీరలు ఇచ్చి సన్మానించారు. మహా దేవాలయం నిర్మాణ ంలో కూలీగా పని చేసిన లక్ష్మమ్మ సన్మానించడం తన అదృష్టమని చంద్రప్రతాప్‌పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామంలోని వృద్దులు, వితంతువులకు 16 మందికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.