భోగాపురం : రాష్ట్రంలో విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతమని ముఖ్యమంత్రి గుర్తించి భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారని గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని అన్నారు. మండలంలో మంగళవారం పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు.
ముందుగా తోటపల్లిలో రూ.1.28కోట్లతో నిర్మించిన బహుళ ప్రయోజన తుఫాను షెల్టరును, ముంజేరులో రూ.19.50లక్షలతో నిర్మించిన ప్రాధమిక పాఠశాల అదనపు తరగతి గదులను, భోగాపురంలో రూ.1.44కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ గిడ్డంగిని, రావాడ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.3.75లక్షలతో నిర్మించిన ఆర్‌ఓ ప్లాంటును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముంజేరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ భోగాపురం మండలంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఇక్కడివారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడనుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3800కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించుకుంటే మన జిల్లాలోనే 380కిలోమీటర్లు వేశామని చెప్పారు. గ్రామాల్లో భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద ఇంకుడు గుంతలు తవ్వాలని, గ్రామ పరిశుభ్రత కోసం గ్రామాల్లో ఇంటికో మరుగుదొడ్డి ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
పచ్చదనం పెంచేందుకు జిల్లాలో 1.25కోట్లు మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టిందని, మొక్కలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఏ పతివాడ నారాయణస్వామి నాయుడు, మాజీ ఎంఎల్‌ఏ కిమిడి గణపతిరావు, భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎంపీపీలు కర్రోతు బంగార్రాజు, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్, జెడ్‌పీటీసీలు పడాల రాజేశ్వరి, ఆకిరి ప్రసాద్, పతివాడ అప్పలనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుతో జిల్లా అభివృద్ధి
Published Wed, Jul 13 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement