సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండేళ్లలోనే అందుబాటులోకి తేవాలని లక్ష్యం నిర్దేశించుకుంది. ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా దీన్ని నిర్మించనున్నారు.
నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్ గ్రూప్ చేపట్టింది. ఇప్పటికే నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వం సాధించింది. వాస్తవానికి అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించాక అందుబాటులోకి తేవడానికి మూడేళ్ల సమయం పడుతుంది. అయితే ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అన్ని కీలక అనుమతులు సాధించడంతో రెండేళ్లలోనే అందుబాటులోకి రానుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరవుతుండటంతోఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మొత్తం మూడు దశల్లో..
ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు.
మూడు దశల్లో ఒకేసారి 22 విమానాలు ఆగేలా 22 ఎయిర్‌బ్రిడ్జిలను నిర్మిస్తారు. ఇందులో భాగంగా తొలిదశలో ఏడు ఎయిర్‌బ్రిడ్జిలను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో కాంప్లెక్స్, విమానాల నిర్వహణ, మరమ్మతులకు ఎంఆర్‌వో యూనిట్, ఏవియేషన్ అకాడమీ, ప్లాంట్ క్వారంటైన్, యానిమల్ క్వారంటైన్ వంటి పలు సదుపాయాలను కల్పించనున్నారు. అలాగే విశాఖ నగరం వైపు అభివృద్ధి చేయనున్నారు.
భారీ విమానాలకు అనువుగా..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమానాలు సురక్షితంగా దిగేలా 3.8 కి.మీ పొడవైన భారీ రన్‌వేను నిర్మించనున్నారు. తూర్పు తీరంలో విశాఖ చాలా వ్యూహాత్మక స్థానం కావడంతో రక్షణ అవసరాల కోసం ఎయిర్‌పోర్టులో 10 ఎకరాలను ప్రత్యేకంగా ప్రభుత్వం కేటాయించింది.
ఇవి కాకుండా అంతర్జాతీయ విమాన సర్వి సులకు అవసరమైన కస్టమ్స్, ఇమిగ్రేషన్‌లతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎయిర్‌పోర్టుకు ఆనుకొని ఉన్న 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏరో సిటీని అభివృద్ధి చేయనుంది.
అడ్డంకులన్నీ అధిగమించి.. కీలక అనుమతులు సాధించి..
గత ప్రభుత్వం భూసేకరణ కూడా పూర్తి చేయకుండానే ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేసింది. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అన్ని అనుమతులు వచ్చాకే నిర్మాణ పనులను ప్రారంభిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)ల్లో నమోదైన కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. అలాగే భూసేకరణకు సంబంధించిన అన్ని అడ్డంకులను అధిగమించింది.
విమానాశ్రయం ప్రారంభించాక ప్రస్తుతం విశాఖలోని నేవీ విమానాశ్రయం నుంచి 30 ఏళ్లపాటు వాణిజ్య సేవలను నిలిపివేయడానికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) పొందింది. అలాగే ఎయిర్‌పోర్టు భద్రతకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆమోదం, పలు సర్వి సు సేవలకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), విదేశీ సర్వి సుల నిర్వహణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలతో పలు ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది.
నిర్వాసితులకు అండగా..
విమానాశ్రయ నిర్మాణం నేపథ్యంలో నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించారు. ఇందుకోసం పోలిపల్లి, గూడిపవలస వద్ద 50.3 ఎకరాల్లో సుమారు రూ.77 కోట్లతో రెండు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ప్రభుత్వం అభివృద్ధి చేసింది.
ప్రైవేటు రియల్ ఎసేŠట్ట్ వెంచర్లకు దీటుగా కాలనీల్లో 30 అడుగుల సీసీ రోడ్లు, డ్రైనేజ్, ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయి, కమ్యూనిటీ హాళ్లు, చిల్డ్రన్ పార్క్, పాఠశాల, పోస్టాఫీసు, షాపింగ్ కాంప్లెక్స్, దేవాలయాలు వంటి అనేక సదుపాయాలను కల్పించడంతో ప్రజలు సంతోషంగా గ్రామాలను వదిలి పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు.
2025 నాటికి తొలి విమానం..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. 2025 నాటికి ఇక్కడి నుంచి తొలి విమానం ఎగరాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టులతో పారిశ్రామికంగా ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంది.
– గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి
అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం..
నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అన్ని అనుమతులు సాధించాకే నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నాం. దీంతో రెండేళ్లలోనే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం రానుంది. అలాగే స్థానిక కుటుంబాలకు సాధ్యమైనంత ఎక్కువ సాయం అందించడానికి సీఎం ఆదేశాలకు అనుగుణంగా అత్యాధునిక వసతులతో పునరావాస గ్రామాలను అభివృద్ధి చేశాం.
- వీఎన్ భరత్ రెడ్డి, ఎండీ, ఏపీఏడీసీఎల్
Comments
Please login to add a commentAdd a comment