మెట్రోకు పచ్చజెండా!
డీపీఆర్‌కు ప్రభుత్వ ఆమోదం
గాజువాకను కలుపుతూ నిర్మాణం
2018నాటికి పూర్తిచేస్తామని ప్రకటన
విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు దిశగా ముందడుగు పడింది. డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వం శనివారం ఆమోదించింది. శ్రీధరన్ డీపీఆర్‌ను సీఎం చంద్రబాబుకు శనివారం విజయవాడలో సమర్పించారు. దాన్ని యధాతథంగా ఆమోదిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ముందుగా అనుకున్న విధంగానే గాజువాకను కలుపుతూ మెట్రోరైలు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. రూ.12,727కోట్ల బడ్జెట్‌లో 49శాతం నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తాయని సీఎం చెబున్నారు.
విశాఖపట్నం : మూడు కారిడార్లుగా మెట్రోరైలు ప్రాజెక్టును ప్రభుత్వం చేపడుతుంది. మొదటి కారిడార్ గాజు వాక నుంచి కొమ్మాది వరకు నిర్మిస్తారు. 30.39కి.మీ.పొడవుం డే ఈ కారిడార్‌లో మొత్తం 22 స్టేషన్లు ఉంటాయి. రెం డో కారిడార్ గురుద్వారా జంక్షన్ నుంచి పాతపోస్టాఫీసు వరకు నిర్మిస్తారు. 5.25కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 7 స్టేషన్లు ఉంటాయి. మూడో కారిడార్‌ను తాటిచెట్లపాలెం నుం చి చినవాల్తేర్ ఈస్టుపాయింట్‌కాలనీ వరకు నిర్మిస్తారు. 6.91కి.మీ. పొడవుండే ఈ కారిడార్‌లో 9 స్టేషన్లు ఉంటాయి.
రూ.12,727కోట్లు బడ్జెట్
మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టును రూ.12,727కోట్లు బడ్జెట్‌తో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థికంగా భారంకావడంతోపాటు ఫీజబులిటీ తక్కువుగా ఉన్నందున ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తిచూపించవు. అందుకే దీన్ని ‘స్పెషల్ పర్పస్ వెహికిల్’ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్‌కే ఈ ప్రాజెక్టును అప్పగించారు. మొత్తం నిధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 49శాతం నిధులు సమకూరుస్తాయి.
మిగిలిన 51 శాతం నిధులను రుణరూపంలో సేకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.2,163కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,231కోట్లు కేటాయిస్తాయి. మిగిలిన 6,371కోట్లను అంతర్జాతీయ సంస్థల నుంచి రుణంగా సేకరిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టి 2018, డిసెంబర్‌నాటికి పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. 2018, డిసెంబర్‌నాటికి మెట్రోరైలును పట్టాలు ఎక్కిస్తామని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శనివారం విజయవాడలో ప్రకటించారు. అందుకు అవసరమైన భూసేకరణ, ఇతర ప్రక్రియలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.