1964 డిసెంబరులో సంభవించిన ఒక తుఫాను కారణంగా రామేశ్వరానికి, తమిళనాడు ప్రధాన భూభాగానికి అనుసంధానంగా ఉండే పంబన్ వంతెన కొట్టుకుపోయింది. ఈ వంతెన మరమ్మతులు చేయటానికి రైల్వే శాఖ ఆరు నెలల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు శ్రీధరన్ పని చేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ సంస్థ యజమాని ఈ ప్రాజెక్టు నుంచి పలు కారణాల రీత్యా పక్కకు తప్పుకున్నారు. దాంతో ఆ ప్రాజెక్టు మరమ్మతుల బాధ్యత శ్రీధరన్ స్వీకరించారు. 46 రోజుల్లో వంతెనను పునరుద్ధరించి రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి పురస్కారం అందుకున్నారు.
అయితే ఇదొక్కటే ఈ ‘మెట్రో మేన్’ ఘనత కాదు. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ అయిన కలకత్తా మెట్రో ప్రణాళిక, రూపకల్పనలకు 1970 లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా శ్రీధరన్ బాధ్యత వహించారు. ఆ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి భారతదేశంలో కొత్త ప్రయాణ శకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం 1979లో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో చేర్టారు. 1987లో ఆయన వెస్టన్ర్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 1990లో అన్ని విధులకు పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన సేవలు దేశానికి ఇంకా అవసరమని భావించిన ప్రభుత్వం కొంకణ్ రైల్వే విభాగానికి సిఎండిగా నియమించింది. ఒక ప్రాజెక్టును ఆయన చేతికి అందించింది.
82 కిలోమీటర్ల పొడవున 93 సొరంగాలు, మృదువైన నేల ద్వారా ఒక సొరంగ మార్గం, మొత్తం 760 కిలోమీటర్ల దూరం, 150 కి పైగా వంతెనల నిర్మాణంతో కూడుకుని ఉన్న ఆ ప్రాజక్టును కూడా శ్రీధరన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు ఆయనను ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ ప్రాజెక్టును 1997 మధ్య నాటికి అన్ని షెడ్యూల్ విభాగాలలో గడువు తేదీ కన్నా ముందే పూర్తిచేసి ప్రశంశలు అందుకున్నారు శ్రీధరన్. ఆ ప్రాజెక్టు తర్వాతనే మీడియా ఆయన్ని ‘మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనడం మొదలు పెట్టింది.
ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో 16 సంవత్సరాల సేవ తరువాత 2011 డిసెంబరులో ఆయన పదవీ విరమణ చేశారు. శ్రీధరన్ 1932 జూన్ 12న కేరళలోని, పాలక్కాడ్ సమీప గ్రామంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌గా ఉన్నారు. 1953 లో యుపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ పరీక్షను పూర్తి చేసి, ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐఆర్‌ఎస్‌ఇ) లో చేరారు. 1954 డిసెంబర్‌లో దక్షిణ రైల్వేలో ప్రొబేషనరీ అసిస్టెంట్ ఇంజనీర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2008లో భారత ప్రభుత్వం శ్రీధరన్‌ని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం ఆయన తన 90 ఏళ్ల వయసులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
(చదవండి: అజ్ఞాత ఆజ్ఞలు)
Comments
Please login to add a commentAdd a comment