జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది! | GST came into force | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ అమల్లోకి వచ్చింది!

Published Sun, Jul 2 2017 4:35 AM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

GST came into force

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో శ్రీకాకుళంతోపాటు రాజాం, నరసన్నపేట, కాశీబుగ్గ కేంద్రాజీ గా కమర్షియల్‌శాఖకు సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ సర్కిల్‌ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారుల హోదాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కార్యాలయ చిరునామా, పేర్లు కూడా మారాయి. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం  సీటీవోలుగా పిలుస్తున్న అధికారులను తాజాగా అసిస్టెంట్‌ కమిషనర్లగా మార్చారు. ప్రస్తుత డీసీటీవోలుగా ఉన్నవారిని ఇకపై డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో విధులు నిర్వహిస్తారు. ఏసీటీవోలుగా వ్యవహరించిన ఉద్యోగులు ఇకపై జీఎస్‌టీ ఆఫీసర్లగా విధులు నిర్వహించనున్నారు. కార్యాలయ సిబ్బంది మాత్రం ప్రస్తుత విధులనే నిర్వహిస్తారు. కాగా ప్రస్తుతం ఉన్నట్లుగానే విజయనగరం డివిజన్‌గా, విశాఖపట్నం జోన్‌ పరిధిలో శ్రీకాకుళం ఉండనుంది.  

 ఇచ్ఛాపురం చెక్‌పోస్టు మూత
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇచ్ఛాపురం వాణిజ్య పన్నులశాఖ ఉమ్మడి తనిఖీ కేంద్రం (ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టు) మూతపడింది. ఇన్నాళ్లూ అంతర్‌ రాష్ట్రాల సరుకులు బట్వాడా సమయంలో చెక్‌పోస్టు కీలకంగా ఉండేది. పన్నుల రూపేణా కోట్లాది రూపాయల వసూళ్లు జరిగేవి. అయితే జీఎస్‌టీ అమల్లోకి రావడంతో దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పన్నులు అమల్లోకి రానుండడంతో రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులకు చెక్‌ పెట్టారు. దీంతో ఇప్పటివరకూ అక్కడ విధులు నిర్వహించిన సీటీవో, ముగ్గురు డీసీటీవోలు, 13 మంది ఏసీటీవోలతోపాటు కార్యాలయ సిబ్బంది ఆశాఖ కేంద్రం కార్యాలయంలో రిపోర్టు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

హెల్ప్‌లైన్‌ డెస్క్‌ ఏర్పాటు
జీఎస్‌టీ విధానం అమలు, మైగ్రేట్‌ విధానంపై వ్యాపారుల కోసం శ్రీకాకుళంలోని అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో (కార్యాలయం పేరు మారింది)హెల్ప్‌లైన్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు కమర్షియల్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ జి.రాణీమోహన్‌ తెలిపారు. జీఎస్‌టీపై వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అవగాహన పొందాలనుకునే వ్యాపారులు ఇదివరకు వ్యాట్‌ పరిధిలో ఉండి, మైగ్రేట్‌ అయినవారు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్, ఏఎన్‌ఆర్‌ నంబర్‌ను తీసుకురావాల్సి ఉంటుందన్నారు. అలాగే తాజాగా జీఎస్‌టీ కోటాలో వివరాలు నమోదు చేసుకున్నవారు టీఎన్‌ఆర్‌ (టెంపరరీ రిఫరెన్స్‌ నంబర్‌), ఏఎన్‌ఆర్‌ (అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నంబర్‌)ను తమ వెంట తీసుకురావాలని   స్పష్టం చేస్తున్నారు.  జీఎస్‌టీపై ఎలాంటి అపోహలకు పోవద్దన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement