
అమ్మోరికి విభజన సెగ
జంగారెడ్డిగూడెం :గిరిజనుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతున్న గుబ్బల మంగమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువైంది. దట్టమైన అటవీ ప్రాంతం మధ్య కొలువై పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం వాస్తవానికి మన జిల్లాలోని బుట్టాయగూడెం మండల పరిధిలో ఉంది. గతంలో అమ్మవారి పాత ఆలయం ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేది. అది శిథిలం కావడంతో పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో కొత్త ఆలయం నిర్మించారు. ఈ ప్రాంతం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నా.. అమ్మవారు మాత్రం ఖమ్మం జిల్లాకు చెందిన వారని, అందువల్ల ఆలయం తమకే చెందుతుందని ఖమ్మం జిల్లాకు చెందిన గిరిజనులు వాదిస్తున్నారు. కొండరెడ్డి గిరిజనులు, కోయ తెగకు చెందిన గిరిజనుల మధ్య పొడసూపిన ఈ వివాదం ముదిరి రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది.
వివాదం ఇలా మొదలైంది గుబ్బల మంగమ్మ గుడి నిర్వహణలో విషయమై తలెత్తిన వివాదం గిరిపుత్రులైన కొండరెడ్లు, కోయ తెగల మధ్య చిచ్చు రగులుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయం వ్యక్తంగా వెలసినగుబ్బల మంగమ్మను గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతల్లిగా, వరాలిచ్చే అమ్మగా పేరుండటంతో ఆలయానికి మైదాన ప్రాంతాల నుంచి సైతం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల తాకిడి సైతం పెరుగుతోంది.
ఇదే స్థారుులో ఆలయూనికొచ్చే ఆదాయం సైతం భారీగా పెరిగింది. ఈ మొత్తాన్ని ఆలయ నిర్వహణతోపాటు బుట్టాయగూడెం మండలం కామవరం, మోతుగూడెం, పందిరి మామిడిగూడెం గ్రామాలకు చెందిన కొండరెడ్లు ఆ గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ఇందుకోసం ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని గోగులపూడి, కన్నాయిగూడెం గిరిజనులు సైతం ఆలయ ఆదాయంలో సమాన వాటా పొందుతూ గ్రామాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇదిలావుండగా, 1996లో ఆలయూన్ని దేవాదాయ శాఖకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయూన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దేవాదాయ శాఖ వెనక్కి తగ్గింది. అప్పటినుంచి ఆలయం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలోనే ఉంది. ఆలయ ఆదాయూన్ని పాత పద్ధతిలోనే ధూపదీప నైవేద్యాలతోపాటు ఆ గ్రామాల అభివృద్ధికి వినియోగిస్తూ వస్తున్నారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోగా, తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అశ్వారావుపేట మండలం గోగులపూడి, కన్నాయిగూడెం గ్రామాలకు ఇస్తున్నట్టుగానే తమ గ్రామాలకూ ఆల య ఆదాయంలో సమాన వాటా ఇవ్వాలంటూ అదే మండలంలోని రామచంద్రపురం, వేపులపాడు గ్రామస్తులు పట్టుబడుతున్నారు. దీంతో అశ్వారావుపేట మండల పరిధిలోని గిరిజనులకు, బుట్టాయగూడెం మండల పరిధిలోని గిరిజనులకు మధ్య వివాదాలు మొదలయ్యూయి. రెండు ప్రాంతాల గిరి జనులు కొట్లాటలకు దిగి పోలీసు కేసులు పెట్టుకునే స్థారుుకి విభేదాలు పెరిగారుు. దీంతో అశ్వారావుపేట, బుట్టాయగూడెం మండలాలకు చెందిన పోలీ సులు, అటవీ శాఖ అధికారులు గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆలయ సరిహద్దు ఏ ప్రాంతానికి చెందుతుందో కచ్చితంగా చెప్పాలని అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం, రామచంద్రపురం గ్రామాల గిరిజనులు పట్టుబట్టారు. దీంతో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఐటీడీఏ అధికారులతో ఇటీవల చర్చలు జరిపారు. అమ్మవారి ఆలయం ఖమ్మం జిల్లాకే చెందుతుందంటూ అక్కడి అధికారులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పటివరకూ గిరిజనులకే పరిమితమైన ఈ సమస్య కాస్తా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది.
ఆ ప్రాంతమంతా ‘పశ్చిమ’దే
వివాదాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై చర్చించగా, ప్రస్తు తం ఉన్న ఆలయంతోపాటు, అమ్మవారి పాత ఆల యం కూడా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉన్నట్టు తేలింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అశ్వారావుపేట మండల పరిధిలోని అటవీ ప్రాంతమంతా పశ్చిమగోదావరి జిల్లాలో విలీనమైందనే విషయూన్ని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ దృష్ట్యా జిల్లా పరిధిలో ఉన్న కొత్త ఆలయంతోపాటు శిథిల మైన పాత ఆలయం కూడా మనకే చెందుతుందని రూఢీ చేశారు. ఇందుకు ఖమ్మం జిల్లా అధికారులు ససేమిరా అంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో భక్తులు అధికంగా వచ్చే ప్రతి మంగళవారం, ఆది వారం రోజుల్లో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నారుు. ప్రస్తుత కార్తీక మాసంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తున్నారు. ఈ వివాదానికి వెంటనే పరిష్కారం దొరక్కపోతే ముదిరి పాకాన పడుతుందని, ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు రగిల్చే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.