గుడివాడ బంద్ సక్సెస్ | GUDIVADA boycott Success | Sakshi
Sakshi News home page

గుడివాడ బంద్ సక్సెస్

Published Thu, Sep 5 2013 3:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM

GUDIVADA boycott Success

గుండె మండిన జనం కన్నెర్ర చేశారు.. నిరసనాగ్రహం జ్వాలలై ఎగసింది.. సమ్మె అస్త్రంతో సకల జనులు ధిక్కార స్వరమై నినదించారు.. సమైక్యతే ఏకైక జెండా..అజెండాగా కదంతొక్కారు.. దీక్షలు, బంద్‌లు, రాస్తారోకోలు, అర్ధనగ్న ప్రదర్శనలతో ఆందోళన పతాకస్థాయికి చేరింది.. బందరులో రైళ్లకు సేవ్ ఆంధ్రప్రదేశ్ స్టిక్కర్లంటించి ఉద్యమ తీవ్రతను చాటగా.. బెజవాడలో అష్ట దిగ్బంధంతో సమైక్య గర్జన ప్రతిధ్వనించింది.      
 
సాక్షి, విజయవాడ :  సమైక్య సెగ మిన్నంటుతోంది. జిల్లా అంతటా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మచిలీపట్నంలో మున్సిపల్ ఉద్యోగులు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దు.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్లను బుధవారం స్థానిక రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు అంటించారు. మునిసిపల్ ఉద్యోగుల, ఆఫీసర్స్ జేఏసీ ఆధ్వర్యాన  మునిసిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణ నేతృత్వంలో ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వేస్టేషన్ మేనేజర్ అనుమతితో ఈ కార్యక్రమం నిర్వహించారు.

బందరులో న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాద గుమాస్తాలు, జిల్లా కోర్టు మెయిన్‌గేటు వద్ద చీపుళ్లతో రోడ్డును ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు సెంటరులోని పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద అరగంట సేపు రాస్తారోకో నిర్వహించారు. నందిగామ రైతుపేటలోని ఓ పెట్రోల్ బంక్‌లో వాహనాలకు న్యాయవాదులు పెట్రోల్ కొట్టి నిరసన తెలిపారు. పామర్రు నాలుగురోడ్ల కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. కురుమద్దాలి పంచాయతీ సిబ్బంది, సర్పంచ్ ఆధ్వర్యంలో నాలుగురోడ్ల కూడలిలో జరుగుతున్న దీక్షలలో పాల్గొన్నారు.
 
గుడివాడలో జలదీక్ష..

 ఆర్‌ఎంపీ వైద్యుల ఆధ్వర్యంలో గుడివాడ పెద్దకాల్వలో జలదీక్ష చేపట్టారు. గుడివాడలో 72 గంటల బంద్ విజయవంతమైంది. జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం టెలిఫోన్ నగర్‌లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేస్తున్నారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం రిటైర్డు టీచర్లు రిలేదీక్షలకు కూర్చున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం బుధవారం కూడా కొనసాగింది. మైలవరంలో ఎన్టీటీపీఎస్ గేటు వద్ద రిలేదీక్షలు కొనసాగాయి. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరంలో రెవెన్యూ ఉద్యోగులు కూర్చున్నారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 29వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా ఆర్‌ఎంపీలు రిలే దీక్షలు చేశారు. ఉపాధ్యాయ జేఏసీ నేతలు బైక్‌ర్యాలీ జరిపారు.

 జంక్షన్‌లో 48 గంటల బంద్..

 హనుమాన్‌జంక్షన్‌లో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటల బంద్ చేపట్టారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నందిగామ గాంధీసెంటర్‌లో ఏర్పాటుచేసిన రిలే దీక్షా శిబిరం బుధవారం కూడా కొనసాగింది. తిరువూరులో విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై జేఏసీ నాయకులు బైఠాయించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. విస్సన్నపేటలో పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలేదీక్షలు చేయగా, శ్రీశ్రీ విద్యాసంస్థల విద్యార్థులు రోడ్డుపై యూనిట్ పరీక్షలు రాశారు. కంచికచర్లలో ఉపాధ్యాయులు పరిటాల 65వ నంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యాసంస్థల ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కొండపల్లి బి-కాలనీ సెంటర్‌లో నడిరోడ్డుపై విద్యార్థులకు విద్యాబోధన చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

 కంభంపాడు వైఎస్సార్‌సీపీ రిలేదీక్ష..

 వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షా శిబిరం ప్రారంభమైంది. మొదటి రోజు మహిళలు మాత్రమే దీక్షలో పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎన్జీవో జేఏసీ నేతలు తమ కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

 విజయవాడలో రోడ్ల దిగ్బంధం..

 ఏపీ ఎన్జీవోలు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రహదారుల అష్ట దిగ్బంధం నిర్వహించారు. దీంతో విజయవాడలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ట్రాఫిక్ స్తంభించింది. సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం సార్వత్రిక బంద్ నిర్వహిస్తున్నట్లు సీమాంధ్ర విద్యావేత్తల జేఏసీ ప్రకటించింది. గురుపూజోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఐటీఐ కళాశాలల్లో తరగతులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

 ఉద్యమకారుడికి గాయాలు

 విజయవాడ లిక్కర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  భారీ లిక్కర్ సీసా బొమ్మ తయారు చేసి కేసీఆర్ బొమ్మ అతికించి దాన్ని రాళ్లతో కొట్టి నిరసన తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఈ సమయంలో ఒక ఉద్యమకారుడికి నిప్పంటుకుని స్వల్ప గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement