గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తూ చంద్రబాబు
జనాభా తగ్గుతోంది.. యువత తగ్గిపోతోంది
భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్‌లోనే భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతో మంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు.
ఈ క్యాంటీన్ల నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వరి రూ. కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకొని అన్న క్యాంటీన్లకు విరాళాలివ్వాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్‌లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలివ్వొచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2.ను ప్రారంభించి, గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు.
సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎక్కువ మంది పిల్లలున్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాదుతో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశానని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పారీ్టకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి తెచ్చారని అన్నారు.
2019లోనూ తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లే వాడినని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటివరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మంచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్‌రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు 99 చోట్ల అన్న క్యాంటీన్ల ప్రారంభం
వచ్చే నెలాఖరుకి రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మున్సిపల్ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 99 ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని మున్సిపల్ మంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment