తెనాలి: సంక్రాంతి పండుగ సరదాలకు తనివితీరదంటారు. వేకువనే లేచి ధనుర్మాస చలిని వెళ్లగొట్టేందుకు భోగిమంటలు వే సి కుర్రకారు నులి వెచ్చని అనుభూతిని పొందారు. వయోవృద్ధులూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని చలికాచుకున్నారు. మరోవైపు ఇంటిముందు కళ్లాపి చల్లి, ముచ్చటగొలిపేలా ముగ్గులు దిద్ది, గొబ్బెమ్మలను తీర్చిదిద్దిన అతివలు, మంచు బిందువులతో సోయగాలు పోతున్న పువ్వుల తో వాటిని అలంకరించారు. వేకువ వెలుగుల వెంటే వచ్చిన హరిదాసులు, రామదాసు కీర్తనలు, క్షేత్రయ్య పదాలను పాడుతూ సందడి... ఆ వెనకే ‘అయ్యవారికి దణ్ణం పెట్టు’ అంటూ గంగిరెద్దు బసవడు..! ఆ వినోదాలను ఆస్వాదిస్తూనే ఇంటిల్లపాదీ తలంటు స్నానాలు, కొత్త బట్టలతో ముస్తాబయ్యారు. ముందే సిద్ధంచేసుకొన్న పిండివంటలతో విందు భోజనాలు, సాయంత్రానికి పిల్లలకు భోగిపళ్లు, బొమ్మల కొలువులతో రోజంతా లోగిళ్లు ఆనందాల హరివిల్లులే అయ్యాయి.
సంక్రాంతి రైతుల పండుగ. పంటలు ఇంటికి వచ్చే తరుణం, కొత్తసంవత్సరంలో వచ్చే తొలి పర్వదినం అయినందున బాధలెన్ని ఉన్నా, మనసులో అణచిపెట్టుకుని పండుగ వేడుక సాగించారు. చనిపోయిన పెద్దలకు పెట్టుకోవడం, కొత్త అల్లుళ్లను ఆహ్వానించి కొత్త బట్టలు పెట్టడం ఆనవాయితీ. దీనికితోడు ఎప్పట్లానే ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఎక్కడెక్కడో ఉంటున్నవారు రైలు, బస్సు చార్జీలు అందనంత పైకి వెళ్లినా, అన్నిటినీ భరించి సంక్రాంతికి ఇళ్లకు చేరుకున్నారు. రైతులు, ఇతర వర్గాల ప్రజల అసంతృప్తిని గమనించిందేమో? రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. సంక్రాంతి వేడుక ను ఒకరోజు ముందుగానే ఆరంభించింది. గుంటూరులో జరిగిన సంబరాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్ని అసంతృప్తులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏ కుటుంబ పెద్ద కూడా ఇంట్లో వారిని పండుగకు పస్తుపెట్టలేడు. నాలుగు డబ్బులున్నవాళ్లు బాగానే జరుపుకుంటున్నారు. పండుగ బహుమతులను అందించి అయినవారిని ఆనందడోలికల్లో ముంచారు. లేనివాళ్లు అప్పోసప్పో చేసి పండుగ జరుపుకున్నారు. సంక్రాంతికి ఇంత ప్రాముఖ్యత ఉన్నందునే అందరి పండుగయింది. సంక్రాంతి సరదాల్లో అతి ప్రధానమైన కోడిపందేలపై న్యాయశాఖ కొరడా ఝుళిపిస్తున్నా, కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్ర శాసనసభా పతి గ్రామం నకరికల్లు మండలం కండ్లకుంటలో కోడిపందేలు వేశారు. రేపల్లె నియోజకవర్గం బొబ్బర్లంకలోనూ నిర్వహించారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావులు పాల్గొన్నారు.
ఆనందమే అతిథిగా వచ్చె..!
Published Fri, Jan 15 2016 2:05 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement
Advertisement