సాక్షి, తిరుపతి ఎడ్యుకేషన్ : భవానీనగర్‌లోని మోక్షిత ఇంటర్‌లో 95శాతానికిపైగా మార్కులు తెచ్చుకుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి ఇంజినీరింగ్‌లో చేరింది. సహ విద్యార్థులతో కలిసి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లకు వెళ్లడం ప్రారంభించింది. విలాసానికి అలవాటు పడి అబద్దాలు చెప్పి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేసింది. చదువులో వెనుకబడ్డ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు ఐదేళ్లకు పూర్తయ్యింది. అరాకొర మార్కులు సాధించడంతో అనుకున్న ఉద్యోగం రాక చిరు ఉద్యోగంలో చేరింది.
ఇంటర్‌లో 80శాతం మార్కులతో ఉత్తీర్ణుడైన కార్తీక్ ఇంజినీరింగ్‌లో చేరి నాలుగేళ్లు కష్టపడి చదివాడు. చెడు స్నేహాలు, దురలవాట్లకు దూరంగా ఉండి తరగతులు, ప్రయోగశాలలకు క్రమం తప్పకుండా హాజరై సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాడు. క్యాంపస్ సెలెక్షన్స్‌లో ప్రతిభ చూపి రూ.10లక్షల వార్షిక వేతనంలో ప్రముఖ కంపె నీలో ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డాడు.
పదో తరగతి వరకు ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులే ఎక్కువ. పది పూర్తయిన తర్వాత 60శాతానికి పైగా విద్యార్థులు వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్నారు. ఈ సమయంలో తప్పటడుగులు వేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. సెల్‌ఫోన్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిదని విద్యానిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంటూనే కళాశాలకు వెళ్తున్న విద్యార్థులు సైతం స్నేహితుల ప్రభావంతో దురలవాట్లకు లోనయ్యే పరిస్థితులు ఉన్నాయి. మద్యం, ధూమపానం చేయడానికి అలవాటు పడుతున్నారు. సెల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలు చూసి ఉద్వేగాలకు లోనై నేరాలకు పాల్పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు.
తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు. దురలవాట్లకు అలవాటు పడి ఏకాగ్రతతో చదవలేకపోతున్నారు. నగరాల్లోనే కాకుండా పట్టణాల్లో సైతం కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు దిగి అప్పులపాలవుతున్నారు. దీంతో పరీక్షలు సరిగా రాయలేక మార్కులు తక్కువగా వస్తున్నాయి. కొంతమంది ఉత్తీర్ణులు కాకపోవడంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కళాశాలకని చెప్పి నదులు, సముద్రాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.
అరకొరగా చదివితే అంతే
అరకొరగా చదివి బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణులై కోర్సు పూర్తి చేసిన వారికి సరైన ఉద్యోగం లభించడం లేదు. నైపుణ్యం లేకపోతే ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం సాధించడం కష్టమే. ఆ తరువాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లి లక్షలాది రూపాయల ఫీజుల చెల్లించి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. మూడు, నాలుగేళ్ల తరువాత చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. సమయాన్ని వృథా చేయకుండా, తాత్కాలిక ఆకర్షణలకు గురికాకుండా కోర్సుల్లో చేరి మొదటి రోజు నుంచే కష్టపడి చదువుతూ నైపుణ్యాలు పెంచుకుని పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు బాగా లభిస్తున్నాయి. తమ ప్రతిభతో పోటీ పరీక్షల్లో సత్తా చాటి జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రముఖ విద్యాసంస్థల్లో చేరుతున్నారు. అనంతరం ప్రముఖ సంస్థల్లో కొలువు సాధించి కన్నవారికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారు.
సెల్‌తో జాగ్రత్త
సెల్‌ఫోన్‌ను విజ్ఞానం పెంచుకోవడం కన్నా వినోద అవసరాలకే ఎక్కువగా వాడుతున్నారు. అర్ధరాత్రి దాటే వరకు సినిమాలు, వీడియోలు చూస్తున్నారు. రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పోకుండా తరగతి గదిలో ఏకాగ్రత కొరవడి అధ్యాపకులు చెప్పిన పాఠాలు సక్రమంగా వినలేకపోతున్నారు.
వ్యసనాలు వద్దు
మద్యం తాగుతూ షికార్లు చేస్తూ కళాశాలలకు డుమ్మా కొడుతున్నారు. చదువును అశ్రద్ధ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రా ణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి
ఇంటర్ వరకు కొంత నియంత్రణ ఉంటుంది. అనంతరం ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీఎస్సీ, ఫార్మసీ, డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. విద్యార్థులకు ఎక్కువగా స్వేచ్ఛ లభించే దశ ఇదే. దీన్ని సద్వినియోగం చేసుకునే వారు బాగా చదివి తల్లిదండ్రులు గుర్వించేలా ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం సాధిస్తున్నారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి జీవితంలో విజేతలుగా నిలుస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే రెండో వైపు స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తాత్కాలిక ఆనందాలకు ప్రాధాన్యమిస్తూ చదువుపై శ్రద్ధ చూపకుండా విద్యార్థులు దారి తప్పుతున్నారు. ఆకర్షణను ప్రేమగా భావించి చదువును పాడు చేసుకుంటున్నారు. ప్రేమను తిరస్కరించారని దాడులు చేయడం లేదా.. బలవన్మరణానికి పాల్పడడం జరుగుతోంది.
పక్కదారి పడితే అంధకారమే
యుక్తవయసులో హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉండి విద్యార్థులు దారి తప్పే అవకాశం అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు పిల్లల నడవడికను గమనిస్తూ తప్పు మార్గంలో వెళ్లకుండా చూడాలి. కొంచెం ఎక్కువ సమయమే కేటాయించి వారి వ్యవహార శైలి పర్యవేక్షించాలి. నాలుగు నుంచి ఆరేళ్లు కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు లభిస్తుందనే విషయాన్ని పిల్లలకు వివరించి చెప్పాలి.
–డాక్టర్ కృష్ణప్రశాంతి, సీనియర్ జనరల్ ఫిజిషియన్
సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి
విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలవుతున్నారు. ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. పిల్లలను కళాశాలలో చేర్పించి ఇక తమ బాధ్యత తీరిందని తల్లిదండ్రులు భావించకూడదు. నెలలో కనీసం రెండుమార్లయినా కళాశాలకు వెళ్లి అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థి గురించి తెలుసుకోవాలి. అవసరాలకు మించి డబ్బు ఇవ్వకూడదు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించి పిల్ల లకు వివరిస్తుండాలి.
–ఎం.కృష్ణయ్య, ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ)
గారాబం పనికిరాదు
పిల్లలను అతిగా గారాబం చేయకూడదు. ఇదే వారు పాడవడానికి కారణమవుతుంది. నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంపొందించుకునేలా, పెద్దలను గౌరవించడం, మంచి స్నేహితుల అవసరాన్ని తెలుసుకునేలా చూడాలి.
–ప్రకాష్‌బాబు, ప్రిన్సిపాల్, ఎస్పీబ్ల్యూ జూనియర్ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment