రవికిరణ్‌ను అరెస్ట్ చేశాం: ఎస్పీ నాయక్
గుంటూరు : సోషల్ మీడియాలో ఏపీ శాసనమండలిపై అసత్య ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ తెలిపారు. ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘శాసనమండలి పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర ప్రచారం జరుగుతోందని అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెద్దల సభను అసభ్యకరంగా చిత్రించిన ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పొలిటికల్ పంచ్ వెబ్‌సైట్ ఓనర్ రవిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. అసెంబ్లీని మార్ఫింగ్ చేస్తూ అడల్ట్ పిక్చర్ ఫోటోలను పోస్ట్ చేసినందుకు గాను అతని పై సెక్షన్ 67 ఐటీ యాక్ట్, ఐపీసీ 299 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశా’ మన్నారు.
చదవండి...(సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ ఆగ్రహం.. )
మరోవైపు రవికిరణ్ భార్య సుజన తన భర్త అరెస్ట్‌పై శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. పోలీసులమని చెప్పి కొంతమంది తన భర్తను ఇంటి నుంచి తీసుకు వెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సుజన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని డీసీపీ పద్మజ తెలిపారు.