కాయితికి ప్రముఖుల నివాళి
Published Sun, Dec 22 2013 3:01 AM | Last Updated on Thu, Jul 11 2019 8:38 PM
ఆనందపేట(గుంటూరు)/రెంటచింతల, న్యూస్‌లైన్ :గురజాల మాజీ శాసనసభ్యుడు కాయితి వెంకటనర్సిరెడ్డి(68)కి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శనివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుంటూరులోని సాయిభాస్కర ఆస్పత్రి నుంచి శ్యామలానగర్ 1వలైనులోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్ట్రీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, వాణిజ్య విభాగం రాష్ట్ర కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, ఎం.డి.నసీర్ అహ్మద్(గుంటూరు తూర్పు), రాతంశెట్టి రామాంజనేయులు(పెదకూరపాడు), ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్,
పార్టీ నాయకులు యేటిగడ్డ నరసింహారెడ్డి, చింతుగుంట్ల రంగారెడ్డి, మాజీ మంత్రి శనక్కాయల అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, కాంగ్రెస్‌పార్టీ నాయకుడు కూచిపూడి సాంబశివరావు, అభిమానులు, కార్యకర్తలు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన రెంటచింతలకు తరలించారు. రెంటచింతలలోని వైఆర్‌ఎస్ పాఠశాలలో ఉంచిన మృతదేహాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సందర్శించారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడిన ఆత్మబంధువును కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతిమయాత్రలో శ్మశానం వరకు ఆయన పాల్గొన్నారు. మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పంపిన సంతాప సందేశాన్ని స్థానిక తహశీల్దార్ నూనె వెంకటప్రసాద్ చదివి వినిపి ంచారు. నివాళ్లర్పించిన వారిలో ఎమ్మెల్సీ టి.జి.వి కృష్ణారెడ్డి తదితరులున్నారు.
కుటుంబ నేపథ్యం..
కాయితి కృష్ణారెడ్డి, అచ్చమ్మ దంపతులకు 1945 డిసెంబర్ 9న రెంటచింతల గ్రామంలో కాయితి వెంకటనర్సిరెడ్డి జన్మించారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రెండవ కుమారుడు రవికృష్ణ పెట్రోలు బంకు నిర్వహిస్తున్నారు.
రాజకీయ నేపథ్యం
సర్పంచ్‌గా, గురజాల సమితి అధ్యక్షుడిగా ఆయన ప్రజలకు సేవలందించారు. 1985లో గురజాల నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2800 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఎం.అంకిరెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అనుమొల శెట్టి సాంబశివరావుపై 26వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ టికెట్టు రాకపోవడంతో రెబల్‌గా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయారు.
నియోజకవర్గంలోఅభివృద్ధి పనులు..
కాయితి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రెంటచింతలలో 4 సంక్షేమ హాస్టళ్లు, గురజాలలో సబ్-కోర్టు, పొందుగులలో బ్రిడ్జి, 30 పడకల ఆస్పత్రి, విద్యుత్ సబ్-స్టేషన్ మంజూరు చేయించారు. స్థానిక సాగర్‌మాత జూనియర్ కళాశాలకు అటాచ్డ్ హాస్టల్ మంజూరులో కీలక పాత్ర పోషించారు. బీసీ బాలికల హాస్టల్ ఏర్పాటుకు స్థలాన్ని ఉచితంగా అందజేశారు.
Advertisement
Advertisement