అనంతపురం కల్చరల్: జిల్లా వ్యాప్తంగా శనివారం గురుపౌర్ణమి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. నగరంలోని వేమన టెలిఫోన్ భవన్ ఎదురుగా ఉన్న షిర్డీ సాయిబాబా మందిరానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వేలాది మందికి అన్నదానం చేశారు. హెచ్చెల్సీ కాలనీలోని షిర్డీ సాయిబాబా మందిరం, వలీబాబా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదానం చేశారు.
వేణుగోపాల్ నగర్‌లోని షిర్డీ సాయిబాబా మందిరంలో మేయర్ స్వరూప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే హౌసింగ్ బోర్డులోని సాయినాథుని మందిరం, ఆంధ్రాబ్యాంకు కాలనీ, మూడో రోడ్డులోని సాయి మందిరం, రామచంద్రనగర్‌లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మారుతీనగర్‌లోని బాబా మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం సాయిలీల బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ దేవరకొండ శాంతమూర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రాయలసీమ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గాయత్రి హాస్పిటల్‌లో జరిగిన వేడుకల్లో సీఐ గోరంట్ల మాధవ్ పాల్గొన్నారు. పాతూరు చెరువుకట్టపై గల సాయినాథుని ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అదేవిధంగా సంఘమేష్ నగర్, రామనగర్, అరవిందనగర్‌లోని సత్యసాయి కల్యాణమండపం, లక్ష్మీనగర్ సాయిబాబా మందిరాల్లో గురుపౌర్ణమి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అధికారులు విశేష పూజల్లో పాల్గొన్నారు.
నేత్రపర్వంగా గురుపౌర్ణమి వేడుకలు
Published Sun, Jul 13 2014 2:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement