
ఈదురు గాలుల బీభత్సం
- విజయనగరం జిల్లాలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు మృతి
- అంధకారంలో విశాఖ
ఉత్తరాంధ్రలో భారీ నష్టం
- నేలకూలిన విద్యుత్ స్తంభాలు
- ఉష్ణోగ్రతల్లో పెరుగుదలే కారణమంటున్న వాతావరణ నిఫుణులు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ఉత్తరాంధ్రలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. విజయనగరం జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మరోవైపు చిత్తూరు జిల్లా కలికిరి శివారు ప్రాంతంలో వాల్మీకిపురం మండలం మూరేవాండ్లపల్లికి చెందిన దేశాయ్ శ్రీనాథరెడ్డి(45) అనే రైతు పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖ నగరం అర్ధరాత్రి వరకు అంధకారంలోనే ఉండిపోయింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం రాముడువలసకు చెందిన బొంతలకోటి పోలమ్మ, మునగపాటి నారాయణమ్మలు పొలంపనులు చేస్తుం డగా పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఎల్.కోటలో కె.భాస్కరరావుపై ఇంటి గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాడంగి మండలం వాడాడలో ఇంటిపై చెట్టు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన గొట్టాపు తమ్మినాయుడు, నారాయణమ్మ, జగ్గునాయుడులు గాయాలపాలయ్యారు. సుమారు వంద విద్యుత్ స్తంభాలు నేలకూలినట్టు ప్రాథమిక అంచనా. గాలుల తీవ్రత వల్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గజపతినగరంలో రైల్వే స్టేషన్ సమీపం లో ట్రాక్‌కు అడ్డంగా చెట్టు కూలడంతో సుమారు గంటపాటు బొకారోరైలును నిలిపివేశారు. ఉత్తరాంధ్రలో అరటి, మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది.
స్థిరంగా వాయుగుండం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. ఇది ప్రస్తుతం పోర్టుబ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 540కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. విశాఖకు 950 కి.మీ. తూర్పుగా ఉంది. అది మెల్లగా ఉత్తర/ ఉత్తర వాయువ్య దిశగా కదులుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు పేర్కొంది.
రాబోయే 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా పయనించి బంగ్లాదేశ్ మయన్మార్ తీరంవైపు తరలిపోనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించే అవకాశాలున్నాయి. అయితే రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం ఉండబోదని వాతావరణ నిపుణులు తెలిపారు. మరోవైపు చత్తీస్‌ఘడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణా, రాయలసీమల్లో రాగల 48 గంటల్లో అక్కడక్కడ జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
రాష్ట్రమంతా వేడి సెగలు
రాష్ట్రంలో మరోవైపు వేడి సెగలు కొనసాగుతున్నాయి. గురువారం బాపట్లలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోస్తా జిల్లాలతోపాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో 40 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగత్రలు నమోదైనట్టు వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు 42-28 డిగ్రీల మధ్య ఉండవచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.