అధికారుల్లో గుబులు | Hadalettistunna ACB attacks | Sakshi
Sakshi News home page

అధికారుల్లో గుబులు

Published Mon, Sep 30 2013 2:40 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Hadalettistunna ACB attacks

సాక్షి, విశాఖపట్నం : ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరు వలలో చిక్కుతారోనన్న గుబులు పట్టుకుంది. ఈ నెల 4న ఆదాయానికి మించి అదనంగా రూ.కోటి లక్షా 98 వేల ఆస్తులున్నాయన్న అభియోగంపై వుడా డీఎఫ్‌ఓ శంబంగి రామ్మోహన్ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రూ.3 లక్షలు లంచం తీసుకుని నగర పౌరసరఫరాల శాఖ అధికారి జ్వాలా ప్రకాష్ ఏసీబీకి చిక్కారు. ఒకే నెలలో ఇద్దరు జిల్లా అధికారులు ఏసీబీకి పట్టుబడడంతో మిగతా అవినీతి అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ఏసీబీ అధికారులు కూడా అవినీతి తిమింగలాలపైనే దృష్టి సారిం చినట్టు తెలిసింది. అర్బన్ డీఎస్‌ఓ జ్వాలా ప్రకాష్‌పై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. గ్యాస్ కనెక్షన్ల పేరు మార్పిడి కేసులను పట్టుకోవడంలో ఆయన దిట్ట అనే పేరుంది. ఇప్పుడా కేసే ఏసీబీ అధికారులకు పట్టిచ్చింది.
     
దీనికి సంబంధించి ఫిర్యాది మామిడి కన్నారావు, డీఎస్పీ ఎం.నర్సింహారావు చెప్పిన వివరాలివి. ఆరిలోవకు చెందిన పద్మ అనే మహిళ పేరున ఉన్న దీపం కనెక్షన్‌ను రూ.2,500 లంచం తీసుకుని సింహాచలం అనే మహిళ పేరున మార్చారని ఈ నెల 25న సాయిరామ్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ మామిడి కన్నారావుపై అర్బన్ డీఎస్‌ఓ జ్వాలా ప్రకాష్ కేసు నమోదు చేశారు. కన్నారావు మాత్రం తాను గ్యాస్ కనెక్షన్ పేరు మార్చలేదని, రూ.2,500 తీసుకుని కొత్త కనెక్షన్ మాత్రమే ఇచ్చానని చెబుతున్నారు.

ఇలా వేర్వేరు వాదనలు ఉన్న నేపథ్యంలో  కేసులు నమోదైతే గ్యాస్ ఏజెన్సీ రద్దయిపోతుం దని డీఎస్‌ఓ హెచ్చరించారు. దీంతో స్థానిక సింగ్ హోటల్ జంక్షన్‌లోని నవోదయ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్, తన సోదరుడు మామిడి అప్పలకొండకు ఈ విషయాన్ని కన్నారావు చెప్పాడు. తనపై కూడా ఇదే తరహాలో కేసు నమోదు చేశారని, రూ.2 లక్షలు ఇస్తే మాఫీ చేస్తానని చెప్పారని, ఈ కేసుపై కూడా మాట్లాడతానని, భయపడాల్సిన అవసరం లేదని సోదరుడికి అప్పలకొండ ధైర్యం చెప్పారు. ఆ మేరకు ఆయన డీఎస్‌ఓతో మాట్లాడారు. రూ.5 లక్షలు లంచం ఇస్తే కేసు రద్దు చేస్తానని డీఎస్‌ఓ చెప్పారు.

ఆదివారంలోగా కన్నారావు, సోమవారంలోగా అప్పలకొండ లంచం ఇచ్చేం దుకు ఒప్పందం కుదిరింది. కానీ అంత మొత్తం ఇచ్చుకోలేక కన్నారావు ఆదివారం ఉదయం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహారావు పథక రచన చేశారు. రూ.5 లక్షలు ఇవ్వలేనని, రూ.3 లక్షలు ఇవ్వగలన ని చెప్పమని డీఎస్‌ఓ ఇంటికి కన్నారావును పంపించారు. వారి సూచన మేరకు పాండురంగాపురంలో ఉంటున్న డీఎస్‌ఓను ఫిర్యాది కలిశారు. రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలనని డీఎస్‌ఓతో సంప్రదింపులు జరిపారు. దానికి ఆయన అంగీకరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా ఇంటికి తెచ్చివ్వాలని చెప్పారు.
     
దీంతో కన్నారావు పథకం ప్రకారం రూ.3 లక్షల నగదును డీఎస్‌ఓకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో సీఐలు రామకృష్ణ, రాఘవరావు, రమణారావు పట్టుకున్నారు. చిక్కడమే తరువాయి ఏకకాలంలో ఇంట్లో సోదాలు ప్రారంభించారు. కీలకమైన డాక్యుమెంట్లు దొరకడంతో రాత్రంతా సోదాలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement